జగిత్యాల, మే 5 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డిది ప్రజా పాలన కాదని, ప్రజావంచక పాలన అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి విమర్శించారు. ఇది ధాన్యం కొనలేని, పంటల బీమా అమలు చేయలేని దిక్కుమాలిన ప్రభుత్వమని మండిపడ్డారు. రైతులు కడుపు మండి రోడ్డెక్కుతున్నారని, దీనికి సర్కారు కారణం కాదా? అని నిలదీశారు. పూడూరులో రైతులు చేసిన ధర్నాతో అధికార యంత్రాంగంలో చలనం వచ్చిందని, ఇంకా ప్రజాప్రతినిధులకే చలనం రాలేదన్నారు. ఇప్పటికైనా కండ్లు తెరవాలని, విమర్శలు మానుకొని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని హితవు పలికారు. తాము రైతుల కోసం ఏ విమర్శనైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రేవంత్ ప్రజలను వంచిస్తుంటే.. భరించలేక, దాన్ని సమర్థించలేక బీఆర్ఎస్లో చేరి ప్రజా గొంతుకగా ముందుకు సాగుతున్నాని చెప్పారు. నాడైనా.. నేడైనా.. తనది ప్రజల పక్షమేనని తేల్చి చెప్పారు.
మక్కల నిల్వకు జిల్లాలో గోడౌన్లు అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం, మక్కలు కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. కానీ, రేవంత్ సర్కారుకు మాత్రం కనీస ముందస్తు ప్రణాళిక లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో మక్కలు కాంటా చేసి రెండు వారాలు గడుస్తున్నా తరలించడం లేదని, ఎక్కడి కుప్పులు అక్కడే ఉండి రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారన్నారు. ధాన్యం కొనేవారు లేక రైతులు కడుపు మండి రోడ్డెక్కారని, రైతులు రోడ్డెక్కే వరకు అధికారులు, ప్రజాప్రతినిధులకు ధాన్యం కొనాలన్న సోయి లేకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో మాత్రం ఈ యేడాది ఇప్పటి వరకు 20 వేల క్వింటాళ్లే కొన్నారన్నారు.
కొడిమ్యాలలో 20 కేంద్రాలుంటే నాలుగే ప్రారంభించారని, మిగిలినవి ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. తేమ శాతం తగ్గిపోయి కాంటా అయిన ధాన్యం బరువు తగ్గి రైతులు నష్టపోతున్నారని, దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. తూకం వేసిన 24 గంటల్లో ధాన్యం అన్లోడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అభివృద్ధి కోసం రేవంత్‌తో కలిసి పనిచేస్తున్నానని అంటున్నారు కదా.. ధాన్యం కొనుగోలు, మద్దతు ధర కల్పించడం, కటింగ్ లేకుండా తూకం వేయడం అభివృద్ధిలో భాగం కాదా..? అని ప్రశ్నించారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, అయిల్నేని వెంకటేశ్వరరావు, శీలం ప్రవీణ్ కుమార్, దావ సురేశ్, అయిల్నేని సాగర్ రావు, గాజుల రాజేందర్, కళ్లేపల్లి దుర్గయ్య, మాసర్తి రమేశ్, ధర రమేశ్ బాబు, దేవేందర్ నాయక్, రాజశేఖర్, సతీశ్, సురేందర్, స్వామి, వంశీ, నరేశ్, మునీందర్ రెడ్డి, సుధాకర్, గంగాధర్, మహిపాల్, నక జీవన్, రాజు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సత్యం నోరు అదుపులో పెట్టుకో..
ధాన్యం కొనాలని ధర్నా చేస్తే మహిళా రైతులపై దాడి చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడం సిగ్గుచేటు. 75 ఏళ్ల వయసున్న జీవన్‌రెడ్డిని సైతం ఈడ్చుకువెళ్లడం అన్యాయం. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నరు. రైతులు సోమవారం ధర్నా చేస్తే జిల్లా మంత్రి మంగళవారం కలెక్టర్‌తో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నడు. బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు రోడ్డెకితే గానీ ధాన్యం కొనాలన్న సోయి లేదు. ఎమ్మెల్యే సత్యం జీవన్‌రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటు. అసలు జీవన్‌రెడ్డి లేకపోతే ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఎకడిది? సత్యం నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కేసీఆర్ భిక్షతో ఎమ్మెల్యే అయ్యాడన్న సంగతి మరిచిపోవద్దు. ఆయన వ్యవహారం చూస్తే తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్టు ఉన్నది. ఎమ్మెల్యే సత్యం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఒక్క కిలో అదనంగా లేకుండా తూకం వేస్తామని ప్రకటించిండు. అదనంగా తూకం వేస్తున్నట్టు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చాలెంజ్ విసిరిండు. ఎనీ సెంటర్.. ఎనీ ప్లేస్ ఎమ్మెల్యే రావాలి. నేను పది గంటలకు కొండగట్టుకు వస్త. ఎమ్మెల్యే సత్యం వస్తడా? ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి. కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శిస్తే హీరో కాలేవన్న విషయాన్ని ఆయన గ్రహించాలి. – చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
జీవన్‌రెడ్డి లేకపోతే మీ అడ్రస్ ఎక్కడిది?
ప్రజా సమస్యల పరిషారం కోసం ధర్నా చేసిన నాయకుడు జీవన్‌రెడ్డి. అలాంటి వ్యక్తిని విమర్శించడం హాస్యాస్పదం. ప్రాథమిక విలువలు కూడా తెలియని వ్యక్తులు ప్రజాప్రతినిధులు కావడం బాధాకరం. రైతులతో కలిసి జీవన్‌రెడ్డి, రవిశంకర్ ధర్నా చేస్తే సర్కారు ఈ రోజు కండ్లు తెరిచింది. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలి. జీవన్‌రెడ్డి లేకపోతే ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేస్తున్నవారికి అడ్రస్ ఎక్కడిది? బీఆర్ఎస్ పెట్టిన భిక్షతో డాక్టర్ సంజయ్ కుమార్ రెండుసార్లు ఎమ్మెల్యే అయిండు. అధికారం కోసం రేవంత్ పకన చేరిండు. సోమవారం కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన ఏ పార్టీ కండువా కప్పుకోకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. అసలు ఏ పార్టీకి చెందినవాడో తెలియని వ్యక్తి వద్దకు వచ్చి చొప్పదండి ఎమ్మెల్యే సత్యం మాట్లాడడం విడ్డూరంగా ఉన్నది.
– జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత