భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’.. దాయాదిని ఆర్థికపరంగానూ కోలుకోలేని దెబ్బతీస్తున్నది.
రెండు రోజుల్లో పాకిస్థాన్ స్టాక్ ఎక్సే ంజ్ 10వేల పాయింట్లకుపైగా నష్టపోయింది. భారతీయ స్టాక్ మార్కెట్లూ ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. అయితే భయపడాల్సిందేమీ లేదని ఈక్విటీల గత చరిత్రనే చెప్తున్నది.
ముంబై, మే 8 : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల్ని తీవ్రతరం చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇవి అటు పాకిస్థాన్ స్టాక్ ఎక్సేంజ్, ఇటు భారతీయ స్టాక్ ఎక్సేంజ్లనూ ప్రభావితం చేస్తున్నాయి. బుధ, గురువారాల్లో పాకిస్థాన్ స్టాక్ ఎక్సేంజ్ ఏకంగా 10వేల పాయింట్లకుపైగా నష్టపోయింది. ఇక బుధవారం లాభాల్లో ముగిసినా.. గురువారం మాత్రం దేశీయ సూచీలు నష్టాలకే పరిమితమయ్యాయి. అయితే ఈ నష్టాలు తాత్కాలికమేనని గతంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పుడు భారత స్టాక్ మార్కెట్ల ప్రదర్శనను చూస్తే అర్థమవుతున్నది.
1999 నుంచి చూస్తే ఇప్పటిదాకా భారత్-పాక్ మధ్య ప్రధానంగా 6 ఉద్రిక్తకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇందులో మెజారిటీ సమయాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపరులకు లాభాలనే పంచాయి. అమెరికా స్టాక్ ఎక్సేంజీల్లో నమోదైన టాప్-500 కంపెనీల షేర్ల తీరుతెన్నులను ప్రతిబింబించే ఎస్అండ్పీ 500 ఇండెక్స్‌తో పోల్చితే ఆయా సమయాల్లో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ, 30 షేర్ల సెన్సెక్స్ ప్రదర్శన ఎంతో మెరుగ్గా ఉన్నది మరి. ఆయా ఘటనలు జరిగిన రోజుల్లో సూచీ నష్టాలకు లోనైనా.. ఆ తర్వాత మాత్రం లాభాల్లోనే దూసుకెళ్లింది. ప్రతీసారీ సూచీలు త్వరగానే కోలుకున్నాయి. ముఖ్యంగా దాయాది దేశానికి ధీటుగా భారత్ స్పందించిన ప్రతిసారీ మదుపరుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. విదేశీ మదుపరులూ పెట్టుబడుల ప్రవాహానికి మద్దతు పలకడం గమనార్హం. కార్గిల్ యుద్ధం, పార్లమెంట్‌పై ఉగ్రదాడి, ముంబై ఉగ్రదాడులు, పఠాన్ కోట్ దాడి.. ఆ తర్వాత జరిగిన పరిణామాల వేళ విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐ) భారతీయ మార్కెట్లలో పెట్టుబడులకే ప్రాధాన్యతనిచ్చారు.
భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఆతిథ్య, విమానయాన, రక్షణ రంగాల్లోని సంస్థల షేర్లను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. పర్యాటక, ప్రయాణ సేవలకు అంతరాయం కలగడం వల్ల హోటల్స్, ఏవియేషన్ కంపెనీల షేర్లు నష్టాలకు గురవుతుంటే.. డిఫెన్స్ ఆధారిత కంపెనీల షేర్లకు డిమాండ్ వచ్చిపడుతున్నది. పరిస్థితులు చక్కబడ్డాక హోటల్స్, ఏవియేషన్ షేర్లు తిరిగి పుంజుకుంటున్నాయి. అయితే డిఫెన్స్ కంపెనీల షేర్లకు ఆదరణ క్రమేణా పెరుగుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.
‘ఆపరేషన్ సిందూర్’, ఆ తర్వాత భారత్-పాక్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 411.97 పాయింట్లు లేదా 0.51 శాతం కోల్పోయి 80,334.81 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 80,927.99 వద్దకు పెరిగినా.. మరో దశలో 79,987.61 వద్దకు క్షీణించింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 140.60 పాయింట్లు లేదా 0.58 శాతం పడిపోయి 24,273.80 వద్ద నిలిచింది. ఇంట్రా-డేలో 264.20 పాయింట్లు పతనం కావడం గమనార్హం. అయితే బుధవారం సూచీలు లాభాల్లోనే స్థిరపడ్డ విషయం తెలిసిందే. ఇదిలావుంటే తాజా నష్టాలు.. మదుపరుల సంపదను రూ.5 లక్షల కోట్లకుపైగా హరించుకుపోయేలా చేశాయి. ఈ ఒక్కరోజే రూ.5,00,037.74 కోట్లు దిగజారి బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.4,18,50,596.04 కోట్లకు పరిమితమైంది. ఆటో, ఫైనాన్స్, స్టీల్, టెలికం, బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
పాకిస్థాన్ స్టాక్ ఎక్సేంజ్ (పీఎస్ఎక్స్)లో నష్టాల వరద పారుతున్నది. పాక్ కవ్వింపు చర్యలకు భారత్ ధీటుగా బదులిస్తుండటం, అంతర్జాతీయ సమాజం నుంచి దాయాది దేశంపై పెరుగుతున్న ఒత్తిళ్ల నడుమ.. మదుపరులు పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం మరో 6,500 పాయింట్లదాకా పీఎస్ఎక్స్ ఇండెక్స్ పతనమైంది. 6,482.21 పాయింట్లు లేదా 5.89 శాతం క్షీణించి 1,03,526.82 వద్ద ముగిసింది. బుధవారం 3,521 పాయింట్లు (3.10 శాతం) పడిపోయిన విషయం తెలిసిందే. ఒకానొక దశలోనైతే 6,561 పాయింట్లు దిగజారింది. గురువారం సైతం ఇంట్రా-డేలో 6,948.73 పాయింట్లు కోల్పోయింది. దీంతో ఈ రెండు రోజుల్లోనూ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ను పీఎస్ఎక్స్ వర్గాలు ఆపేశాయి. ఈ నష్టాల దెబ్బకు పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్తున్న ధైర్య వచనాలు కూడా ఏమాత్రం ఫలితాన్నివ్వలేకపోతున్నాయి. మొత్తానికి గత రెండు రోజుల్లో 10వేల పాయింట్లకుపైగా నష్టాలను పీఎస్ఎక్స్ మూటగట్టుకున్నది.
‘ఆపరేషన్ సిందూర్’తో భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తక్షణమే మార్కెట్ ఒడిదొడుకులకు దారితీశాయి. అయితే పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కార్గిల్ వార్, ముంబై ఉగ్రదాడుల సమయాల్లో 4 శాతం.. పార్లమెంట్ దాడి, బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్ వేళల్లో 3 శాతం చొప్పున సెన్సెక్స్, నిఫ్టీ క్షీణించాయి. కానీ ఇది తాత్కాలికం. దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మంచి లాభాలనే పంచాయి. కార్గిల్ వార్ తర్వాత సెన్సెక్స్ 63 శాతం పుంజుకున్నది. అలాగే పార్లమెంట్‌పై దాడి అనంతర పరిస్థితుల్లో 20 శాతం, ముంబై దాడులు, బాలాకోట్ ఘటనల తర్వాత 60 శాతం, 15 శాతం చొప్పున పెరిగాయి. దీన్నిబట్టి మార్కెట్ ఒడిదొడుకులు స్వల్ప కాలానికి చెందినవేనని స్పష్టమవుతున్నది.
‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యం లో మార్కెట్లలో ఒడిదొడుకు లు సహజం. ప్రస్తుత పరిస్థితులకు భీతిల్లి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ల దిశగా వెళ్లకపోవడమే మంచిది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లకు లాభం ఉంటుంది. వేచిచూసే ధోరణి ఇప్పటికైతే ఉత్తమం అని చెప్పవచ్చు.