ఉమ్మడి పాలనలో దగాపడిన తెలంగాణ.. పదేండ్ల కేసీఆర్ హయాంలో ధనిక రాష్ట్రంగా విరాజిల్లింది. ఆర్థిక, సామాజిక, సంక్షేమ రంగాల్లో కొత్త శిఖరాలను అధిరోహించింది. అయితే, ఏదో శాపం తగిలినట్టు కేవలం 16 నెలల్లోనే మారిన ప్రభుత్వ తీరుతో సంక్షేమంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులూ తలకిందులయ్యాయి.
జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో జీఎస్టీ వనూళ్లలో దేశానికే తలమానికంగా నిలిచిన ఒకప్పటి తెలంగాణ ఇప్పుడు వెలవెలబోతున్నది. చేతిలో పైసల్లేక ప్రజల కొనుగోలు శక్తి అధఃపాతాళానికి పడిపోయింది.
మొత్తంగా రాష్ట్ర ఆర్థికరంగం అతలాకుతలమయ్యింది. అందుకే, తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చితే గత కేసీఆర్ పాలనే బాగున్నదని ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ గణాంకాలతో సహా తేల్చిచెప్పింది.
KCR | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పోల్చితే గత కేసీఆర్ పాలనే బాగున్నదని ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ పేర్కొంది. కేసీఆర్ పాలనలో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని తెలిపింది. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు తెలంగాణ ఆర్థికరంగం పరుగులు పెట్టిందని గణాంకాలు సహా గ్రోక్ వివరించింది. కానీ, కాంగ్రెస్ 16 నెలల పాలనలోనే ఆదాయపరంగా రాష్ట్రం వెనుకబడిపోయిందని స్పష్టంచేసింది. ప్రభుత్వ విధానాల ఫలితంగా ప్రజల ఆదాయం తగ్గిందని.. దీంతో కొనుగోలు శక్తి క్షీణించిందని పేరొన్నది. ఇటీవల రవాణా శాఖ ఆదాయం తగ్గడాన్ని ఇందుకు ఒక ఉదాహరణగా పేరొన్నది. పదేండ్ల కేసీఆర్ పాలన, కాంగ్రెస్ 16 నెలల పాలనపై గ్రోక్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
‘తెలంగాణలో గత దశాబ్దంలో గ్రామీణాభివృద్ధి గణనీయమైన పురోగతి సాధించింది’ అని గ్రోక్ తెలిపింది. కేసీఆర్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకున్నదని, బీఆర్ఎస్ పాలనలో పల్లెప్రగతి, గ్రామజ్యోతి వంటి కార్యక్రమాలు గ్రామాల్లో సంపూర్ణ పరివర్తనను తీసుకొచ్చాయని తెలిపింది. స్వపరిపాలన, ఆర్థిక సాధికారత వంటి అంశాల్లో గుణాత్మకమైన మార్పులు కనిపించాయని పేరొన్నది. ఈ పురోగతిలో కేసీఆర్ ప్రభుత్వం కీలకపాత్ర పోషించిందని తెలిపింది. 2014 నుంచి 2023 వరకు చేపట్టిన అనేక కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల స్థితిగతులను మెరుగుపరిచాయని వెల్లడించింది.
కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి సైతం పడిపోయిందని గ్రోక్ పేర్కొంది. బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం వేగంగా, స్థిరంగా పెరిగిందని, తెలంగాణను దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల స్థాయికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకెళ్లిందని గ్రోక్ వెల్లడించింది. 2014-15లో తలసరి ఆదాయం రూ.1,24,104గా ఉండగా, 2023-24 నాటికి రూ.3,47,229కు చేరిందని తెలిపింది. తొమ్మిదేండ్లలో దాదాపు 180% వృద్ధిని నమోదు చేసిందని, సంవత్సరానికి సగటున 12-15% వృద్ధిరేటు సాధించిందని అభినందించింది. కాంగ్రెస్ 16 నెలల పాలనలో తలసరి ఆదాయ వృద్ధిరేటు గణనీయంగా తగ్గిందని గ్రోక్ స్పష్టంచేసింది. ఆర్థిక స్తబ్ధత సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. 2024-25లో తలసరి ఆదాయ వృద్ధిరేటు 9.61 శాతంగా నమోదైందని, ఇది 2023-24లో 14.1%, 2022-23లో 16.2 శాతంతో పోలిస్తే చాలా తకువని పేర్కొంది. 16 నెలల కాలంలో సగటు వృద్ధిరేటు 6-7% మాత్రమే ఉండవచ్చని అంచనా వేసింది. 2024-25లో జాతీయ తలసరి ఆదాయ వృద్ధి 8-9% ఉంటుందని, తెలంగాణ ఈ సగటును అందుకోలేకపోయిందని తెలిపింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2023-24 వరకు రాష్ట్రాల తలసరి ఆదాయ వృద్ధిలో టాప్-5లో ఉన్న తెలంగాణ, 2024-25లో 11వ స్థానానికి పడిపోయిందని వెల్లడించిం ది. మూలధన వ్యయం తగ్గడం (రూ.44,252 కోట్ల నుంచి రూ.32,745 కోట్లకు), 16 నెలల్లో రూ.లక్షన్నర కోట్లు అప్పులు చేయడం, జీఎస్టీ వసూళ్లు తగ్గడం వంటివి ఇందుకు కారణాలుగా తెలిపింది.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు భారీగా తగ్గాయని కూడా గ్రోక్ తెలిపింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో జీఎస్టీ వసూళ్ల వృద్ధిని పోల్చితే స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుందని వివరించింది.
కాంగ్రెస్ హయాంలో ఆర్థిక వృద్ధి మందగించడం ప్రజల కొనుగోలు శక్తి తగ్గడానికి ఒక సూచిక అని గ్రోక్ హెచ్చరించింది. ఇటీవల రవాణా శాఖ ఆదాయం తగ్గడంపై ఏఐ చాట్‌బాట్ స్పందించింది. రవాణా శాఖ ఆదాయం తగ్గడం ఒక ఆందోళనకర అంశంగా పేరొన్నది. ‘ఎందుకంటే ఇది రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి ఒక ముఖ్యమైన సూచిక. రవాణా శాఖ ఆదాయం వాహన రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, పన్నులు, జరిమానాల ద్వారా సమకూరుతుంది. ఇవి ప్రజల ఆర్థిక సామర్థ్యం, వాణిజ్య కార్యకలాపాల స్థాయిని ప్రతిబింబిస్తాయి. రవాణా శాఖ ఆదాయం తగ్గడం కొనుగోలు శక్తి తగ్గడాన్ని సూచిస్తుంది. ఇది వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, వ్యవసాయ రంగాల్లో క్షీణతతో ముడిపడి ఉండవచ్చు’ అని గ్రోక్ అభిప్రాయపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మహాలక్ష్మి వంటి ఉచిత రవాణా సేవలు ఆర్టీసీ ఆదాయాన్ని గణనీయంగా దెబ్బతీస్తున్నాయని, రోజుకు రూ.5 కోట్ల నష్టం వస్తుందన్న అంచనాలు ఉన్నాయని తెలిపింది. ఈ పథకం అమలుకు ఏడాదికి రూ.10,000 కోట్లు అవసరమని ఆర్టీసీ అంచనా వేయగా, బడ్జెట్లో రూ.4,305 కోట్లే ప్రతిపాదించిందని విమర్శించింది. రియల్ ఎస్టేట్, హోటల్ రంగాల్లో కుదేలవడంతో వాహన కొనుగోళ్లు తగ్గి, రవాణా శాఖ ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడిందని అభిప్రాయపడింది.
కేసీఆర్ హయాంలో తెలంగాణలో జీఎస్డీపీ గణనీయంగా పెరిగిందని గ్రోక్ స్పష్టంచేసింది. రాష్ర్టాన్ని దేశంలో అగ్రగామి ఆర్థిక శక్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపిందని వెల్లడించింది. ఇదే సమయంలో 16 నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థిక సంక్షోభ సూచనలు కనిపిస్తున్నాయని గ్రోక్ హెచ్చరించింది. రెండు ప్రభుత్వాల పాలనలో తేడాను గణాంకాలతో సహా వెల్లడించింది.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ జీఎస్డీపీ 2014-15లో రూ.5.05 లక్షల కోట్ల నుంచి 2023-24 నాటికి రూ.15.01 లక్షల కోట్లకు చేరుకుందని గ్రోక్ తెలిపింది. దాదాపు 196.9% వృద్ధిని సాధించినట్టు చెప్పింది. తద్వారా దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచినట్టు వెల్లడించింది. 2014-15 నుంచి 2022-23 వరకు సగటు వృద్ధి రేటు 12.7% ఉందని, ఇది జాతీయ సగటు 10.5% కంటే ఎకువని గ్రోక్ స్పష్టంచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వంటి సాగునీటి పథకాలు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా వంటి వ్యవసాయ సంబంధిత సంసరణలు, సేవల రంగంపై (ముఖ్యంగా ఐటీ) దృష్టి పెట్టడం వంటివి ఈ వృద్ధికి దోహదపడ్డాయని తెలిపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, దాదాపు 16 నెలల పాలనలో (ఏప్రిల్ 2025 వరకు) జీఎస్డీపీ వృద్ధిరేటు, ఆర్థిక పురోగతి మునుపటి కంటే తగ్గినట్టు కనిపిస్తున్నదని గ్రోక్ పేర్కొంది. 2024-25లో జీఎస్డీపీ 10.12%గా ఉందని తెలిపింది. ఇది 2023-24లో బీఆర్ఎస్ హయాంలో సాధించిన 11.9% కంటే తకువని పేర్కొంది. 2024-25లో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ జీఎస్డీపీ వృద్ధిలో 14వ స్థానంలో నిలిచినట్టు పేరొన్నది. గతంలో తెలంగాణ టాప్-3 రాష్ట్రాల్లో ఉండగా.. కాంగ్రెస్ పాలనలో గణనీయంగా పతనమైనట్టు తెలిపింది.
కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వంటి సాగునీటి పథకాలు గ్రామీణ రైతులకు సాగు సౌలభ్యం కల్పించాయని, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా వంటివి రైతుల జీవన ప్రమాణాలను పెంచాయని గ్రోక్ పేరొన్నది.
పంచాయతీలకు నిధులు నేరుగా విడుదల చేయడం, ఈ-పంచాయతీ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా పంచాయతీల్లో పారదర్శకత, వాటి సామర్థ్యం పెరిగాయని గ్రోక్ తెలిపింది. 2023లో తెలంగాణ గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో 13 అవార్డులు గెలుచుకోవడం దీనికి నిదర్శనమని స్పష్టం చేసింది.
దళితబంధు, ఆసరా పింఛన్లు వంటి పథకాలు గ్రామీణ పేదల ఆర్థికస్థితిని బలోపేతం చేశాయని గ్రోక్ తెలిపింది. వీటికి తోడు స్త్రీనిధి లాంటి స్వయం సహాయక బృందాల ద్వారా బీఆర్ఎస్ సర్కారు మహిళల సాధికారతకు దోహదపడిందని తెలిపింది.
పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు వంటి వసతులు అందుబాటులోకి వచ్చాయని గ్రోక్ తెలిపింది. పల్లెప్రగతి పథకం గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చగా మార్చడంలో సహాయపడిందని పేర్కొంది.