హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైన మంచినీటి చేపల పెంపకం కేంద్రం.. ప్రస్తుతం అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ మత్స్యరంగానికి సరికొత్త గుర్తింపు దక్కింది. ఈక్రమంలో దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో మంచినీటి చేపల అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రం ఏర్పాటు అవుతున్నది.
దేశవ్యాప్తంగా మంచినీటి చేపల ఉత్పత్తిని పెంపొందించడంలో భాగంగా కేంద్రం చేపట్టిన ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద రాష్ర్టానికి ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. ఈ పథకం కింద రూ.47 కోట్లతో 13 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 10న మంత్రి వాకిటి శ్రీహరి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
మంచినీటి చేపల ఉత్పత్తిని సాధించడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. 2016-17లో 1,93,732 టన్నుల ఉత్పత్తితో రూ.2,111 కోట్లు, 2025లో రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల విలువైన 4.20 లక్షల టన్నుల చేపలు, రూ.1000 కోట్ల విలువైన 15 వేల టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఈ చేపల్లో 42 శాతం స్థానికంగా, 6 శాతం ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.