ఇథనాల్ సమస్యలు ఇన్నిన్ని కాదయా.. ఒక సమస్యకు పరిష్కారం
సమస్యను మించిన చిక్కులు తెస్తే ఏమవుతుంది? ప్రస్తుతం ఇథనాల్ సమస్య అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నది. పెట్రోల్ కొరతకు ప్రత్యామ్నాయంగా కేంద్రం పంటల ఆధారిత ఇథనాల్‌ను ముందుకు తెచ్చింది.
సమస్యను మించిన చిక్కులు తెస్తే ఏమవుతుంది? ప్రస్తుతం ఇథనాల్ సమస్య అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నది. పెట్రోల్ కొరతకు ప్రత్యామ్నాయంగా కేంద్రం పంటల ఆధారిత ఇథనాల్‌ను ముందుకు తెచ్చింది. ప్రపంచంలోని కొన్ని ఇతర దేశాలు కూడా ఇథనాల్ బాట పట్టాయి. యుద్ధాల వల్ల, ఇతరేతర ఉద్రిక్తతల వల్ల పెట్రోలియం దిగుమతులు ఇబ్బందిగా మారడం కొత్తకాదు. భారత్ తన చమురు అవసరాల్లో కొంచెం అటూఇటుగా 90 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతున్నది.
మనదేశ దిగుమతి వ్యయంలో పెట్రోలియం సింహభాగం ఆక్రమిస్తున్నది. ముడిచమురు దిగుమతి కోసం మన దేశం నెలవారీగా 15.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నది. ఈ తరహా సమస్యలు అన్నిటికీ తక్షణ పరిష్కారం ఇథనాల్ ఒక్కటేనని కేంద్ర సర్కార్ ప్రచారం చేస్తున్నది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలుపాలని సూచిస్తున్నది. తర్వాత ఈ నిష్పత్తిని క్రమంగా పెంచి ఈ-100 పేరిట పూర్తిస్థాయి వాహన ఇంధనంగా ఉపయోగంలోకి తేవాలనే ఆలోచన కూడా ఉన్నది. ప్రయోగాత్మకంగా దేశమంతటా ఈ-20 పేరిట అమలు చేశారు. దీని ఫలితాలు ఆశాజనకంగా లేవు.
ఈ-20తోనే దశం ఇంకా సతమతం అవుతుంటే కేంద్రం ఇప్పుడు ఈ-85ని రంగం మీదికి తెచ్చింది. ప్రస్తుతం దేశంలో 48 ఔట్‌లెట్స్‌లో ఇది అందుబాటులో ఉన్నది. ఈ ఏడాది చివరి నాటికి వీటి సంఖ్య 500కు, వచ్చే ఏడాది 5 వేలకు పెంచాలనేది ఆలోచన. చాలా దేశాలు వాహన కాలుష్యం నివారణకు క్రమంగా విద్యుత్తు బ్యాటరీల వైపు మళ్లుతుంటే ఇండియా మాత్రం ఇంకా సంప్రదాయిక ఇంధనాల్లో ఇథనాల్ చేర్పు మార్గాన్ని ఎంచుకోవడం భిన్నంగానే కనిపిస్తున్నది. ఇథనాల్ అదనంగా ఉత్పత్తి అయ్యే మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌కే మిశ్రమ ఇంధనాన్ని పరిమితం చేయవచ్చుననే సూచనలు కూడా ఉన్నాయి.
దేశం ఎదుర్కొంటున్న చమురు సమస్యకు ఇథనాల్ దివ్యౌషధం లాంటిదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అంటున్నారు. కానీ వాహనదారులు దానిని అంగీకరించలేకపోతున్నారు. ఇథనాల్ ఇంధనంపై దేశ ప్రజల్లో క్రమంగా పెరుగుతున్న వ్యతిరేకతకు గత ఆదివారం ఢిల్లీలో పెద్దఎత్తున జరిగిన నిరసనలు అద్దంపట్టాయి. ఈ వ్యతిరేకతకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. ఇథనాల్ మిశ్రమం వల్ల మైలేజీ బాగా తగ్గడం, రెండు..ఇంజిన్ త్వరగా పాడైపోవడం.
ఇది కొత్తరకం ఇంజిన్ కలిగిన వాహనాలకు మాత్రమే పరిమితం. పాత వాహనాల విషయంలో ఫలితాలు మరింత ఘోరంగా ఉన్నాయని అంటున్నారు. ఈ-20 పెట్రోల్‌తో తమకు ఉపయోగం లేదని, పైగా నష్టం ఎక్కువని 53 శాతం వాహనదారులు అభిప్రాయపడుతున్నట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 10 శాతం మైలేజీ తగ్గిందని 66 శాతం మంది వాపోగా, రిపేర్ ఖర్చులు భారీగా పెరిగాయని 42 శాతం మంది చెప్పడం గమనార్హం. ఇథనాల్ కోసం కార్ల నమూనాలోనూ మార్పులు చేయాల్సి వస్తుంది. ఈపాటికే మారుతి సంస్థ ఒకటి రెండు ఇథనాల్ అనుకూల వ్యాగన్-ఆర్ మాడల్ రిలీజ్ చేసింది. కొన్ని సైకిల్ మోటర్ కంపెనీలు కూడా ఆ దిశగా కసరత్తు జరుపుతున్నాయి.
ప్రభుత్వాలు ఇంధన భద్రత, కార్బన్ తగ్గింపు లక్ష్యాలకు ఇథనాల్‌ను దివ్యమైనదని ప్రశంసిస్తుండగా, వినియోగదారుల వాహన ఆరోగ్యం, ఆహార లభ్యత, నిజమైన పర్యావరణ సుస్థిరతపై దాని నిగూఢమైన దుష్ప్రభావాలను విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. ఇథనాల్‌కు నీటిని ఆకర్షించే గుణం ఉన్నది. దీనివల్ల ఇంధన పైపులు తుప్పుపట్టడం, ఫ్యూయల్ ఇంజెక్టర్లు మూసుకుపోవడం, పాత ఇంజిన్లు వేగంగా చెడిపోవడం జరుగుతున్నది. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో సుమారు 30% తక్కువ శక్తి ఉంటుంది. దీనివల్ల ఖర్చు దాదాపు సమానంగా ఉన్నప్పటికీ ప్రతి గ్యాలన్కూ మైలేజీలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తున్నది.
ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా తలెత్తిన నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. మిశ్రమ ఇంధనం కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉన్నదని సంజాయిషీ ఇచ్చుకున్నది. ఇథనాల్ తయారీకి మానవ జనాభాకు ఆహారం అందించాల్సిన లక్షలాది హెక్టార్ల వ్యవసాయ భూమిని మళ్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారీ మొత్తంలో ఆహారంగా పనికివచ్చే మక్కజొన్న (అమెరికాలో), చెరుకు (బ్రెజిల్, భారతదేశంలో), నూకల బియ్యం లేదా మక్కజొన్న కూడా నేరుగా ఇంధనం తయారీకి వినియోగిస్తున్నారు.
ఇదంతా అనివార్యంగా ఇంధన విధానాలు, ఆహార భద్రత మధ్య పోటీగా పరిణమిస్తున్నది. దీనివల్ల ఊహించిన విధంగానే ప్రపంచ ఆహార ధరలు పెరుగుతాయి. కరువు లేదా పంట కొరతల సమయంలో, ఆహార భద్రత కంటే పారిశ్రామిక ఇంధనానికి ప్రాధాన్యత ఇవ్వడం తీవ్రమైన ప్రతికూలతలను సృష్టిస్తుంది. భారీ సాగుకోసం ఇంధనం, వరి, చెరుకు వంటి పంటలకు అపారమైన నీటిని వినియోగించడం కార్బన్ న్యూట్రల్ లక్ష్యాలను అస్థిరం చేస్తాయని పర్యావరణవాదులు అంటున్నారు.
మరోవైపు భూమి వినియోగం పెరుగడం సమస్య ఎటూ ఉంటుంది. ఇథనాల్ కార్బన్ మోనాక్సైడ్‌ను తగ్గిస్తున్నట్టు భారతీయ వాహన పరీక్షల్లో వెల్లడైనప్పటికీ, పట్టణ పొగమంచు, వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలైన నైట్రస్ ఆక్సైడ్లను అది తగ్గించలేదని తేలింది. ఇలా లాబీల కోసం దేశ ఇంధన, పర్యావరణ, వ్యవసాయ భద్రతను పణంగా పెట్టేందుకు బదులుగా ఇథనాల్ ఉపయోగంపై పునఃపరిశీలన జరుపడం ఎంతైనా అవసరం.
– తుమ్మలపల్లి రఘురాములు
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

