హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రోడ్ల విస్తరణ మీద దృష్టి సారించింది. రాష్ట్రం ఆవిర్భవించిన 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే రోడ్డు నెట్వర్క్ను అభివృద్ధి చేయడానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి వివిధ పద్దుల కింద రూ.18,183 కోట్లు విడుదలచేసింది. గత ఏడున్నరేండ్లలో అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసింది. అన్ని గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, అక్కడ నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్లేన్ రోడ్లు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగులేన్ల రోడ్లు నిర్మించాలని నిర్ణయించి పనులు చేపట్టారు.
2014లో అన్ని రకాల రోడ్లు 98,883 కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం 1,07,871 కిలోమీటర్లకు పెరిగింది. రాష్ట్రంలో అదనంగా 8,988 కిలోమీటర్ల రోడ్లు ఏర్పడ్డాయని సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 96.24 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి అయినట్టు తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్లో ప్రతి వంద చదరపు కిలోమీటర్లకు 4,148 కిలోమీటర్ల రోడ్లు ఉండగా, అత్యంత తక్కువగా ములుగు జిల్లాల్లో 38 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. హైదరాబాద్ తరువాత వరంగల్ జిల్లాలో వంద చదరపు కిలోమీటర్లకు 130 కిలోమీటర్లు, కరీంనగర్లో 121 కిలోమీటర్ల రోడ్లు ఉన్నట్టు పేర్కొన్నది.