EX MLA Kranthi Kiran | ఆందోల్, ఏప్రిల్ 14: తెలంగాణ స్వరాష్ట్రం కోసమే ఏర్పడి… దశాబ్ధాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన నిలిపిన బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్న సందర్బంగా జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవాలను విజయవంతం చేద్దామని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పిలుపునిచ్చారు.
ఇవాళ ఆందోల్ మండల నాయకులతో కలిసి సంగుపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ రజతోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణా రాష్ట్రం వచ్చేది కాదన్నారు. తెలంగాణా పట్ల చిత్తశుద్ధి, వ్యూహాత్మక అడుగులతో తెలంగాణ సాకారమైందన్నారు.
ప్రతీ గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి..
ఉద్యమం కోసం ఒక రాజకీయ పార్టీ ఏర్పడటం దేశంలోనే తొలిసారి అని.. అందుకు బీఆర్ఎస్ సభ్యులుగా అందరం గర్వపడాలని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ న్నారు. పార్టీ రజతోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందున ఆ రోజు ప్రతీ గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని కోరారు.
అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలం అయ్యిందన్నారు. అందుకే ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వం వైపు చూస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో సంతోషంగా లేరు..
ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఆగమాగం చేస్తున్నదని క్రాంతి కిరణ్ విమర్శించారు. ఏ రంగాన్ని తీసుకున్నా ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నదని ఏ ఒక్క వర్గం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో సంతోషంగా లేరన్నారు. చేతికొచ్చిన పంటలు ఎండిపోయినా కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులను పరామర్శించి భరోసా కల్పించలేదని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంతోపాటు ప్రజలకు అందాల్సిన అన్ని పథకాలు అందించడం కోసం వరంగల్‌లో జరిగే రజతోత్సవాల నుంచే సమర శంఖం పూరించనున్నామని.. అందుకోసం అన్ని గ్రామాలలో ప్రజలను పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నామన్నారు.
ఈ నెల 27న నియోజకవర్గం నుండి వరంగల్‌కు ఆందోల్ లోని ప్రతీ గ్రామం నుండి ముఖ్యనాయకులు వరంగల్ సభకు తరలి వెళ్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, మాజీ ఎంపీపీ రామగౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ నాగ భూషణం, మాజీ సర్పంచులు లింగాగౌడ్, అనిల్ రెడ్డి, యేసు, శంకరయ్య, నాయకులు వీరేశం, శంకర్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.