మొయినాబాద్, జూన్ 07: దశాబ్ద కాలం నుంచి భూములు సాగు చేసుకుని జీవనాధారం పొందుతున్న రైతులను గోస పెట్టి గోశాలకు భూములు ఇచ్చే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కేపల్లి 180 సర్వే నెంబర్ లోని 100 ఎకరాలను తీసుకోవాలనే ప్రయత్నాన్ని ఆమె వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో శనివారం నాడు ఆ భూములను సందర్శించారు. బాధిత రైతులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. తమకు అండగా ఉంటామని రైతులకు మనోధైర్యం కల్పించారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కోకాపేటలోని గోశాలకు సంబంధించిన 100 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకొని ఎన్కేపల్లి లోని భూములను గోశాల కేటాయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. కోకాపేట భూములను అమ్మేయాలని కుట్ర చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం భూములను అమ్మి పరిపాలన చేయాలని భావిస్తోందని అన్నారు. రోజుకు రాష్ట్రంలో ఏదో ఒక చోట రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్ కొన్ని వారిన భయభ్రాంతులకు గురిచేసి లాఠీఛార్జి చేసి అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేయడం ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనమని విమర్శించారు. 8 నెలల నుంచి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అస్తవ్యస్తంగా కొనసాగుతుందని… ఏ వర్గం వారు తృప్తిగా లేరని ఆమె స్పష్టం చేశారు.
భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేయాలి
2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేయాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. 100 ఎకరాలలో 50 మంది రైతులు ఏడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారని.. అందులో ఐదారు మంది రైతులను చర్చలకు పిలిచి భూములను లాక్కోవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమకు ఏమి కావాలని రైతులకు ఆప్షన్స్ పెడుతున్నారని రైతుల ఆప్షన్స్ ప్రకారం భూములు పట్టాలు చేయించడం లేదా 2013 చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ రెండు ఆప్షన్లు తప్ప రైతులకు మరొకటి లేదని ఆమె స్పష్టం చేశారు. రైతులంతా ఏకతాటిపై ఉన్నారని వారిని భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కోవాలని చేసే ప్రయత్నాలు సాగవని ఆమె హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్కేపల్లి రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఎన్కేపల్లి రైతులకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
హెచ్సీయూ భూముల్లో ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూములను అప్పనంగా బడా బాబులకు కట్టబెట్టాలని ఆలోచనతో ప్రభుత్వం ఉంటే సుప్రీంకోర్టు అట్టి భూములను అమ్మరాదని మొట్టికాయలు పెట్టిందని స్పష్టం చేశారు. ఆ భూముల అమ్మవద్దని ఆపడంతో మరో భూములు అమ్మాలని ప్రయత్నం చేస్తుందని… అందులో భాగంగానే కోకాపేట గోశాల భూమిని తీసుకొని ఎన్కేపల్లి భూములను గోశాలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుందని ఆమె చెప్పారు. భూములను అమ్మడమే రేవంత్ రెడ్డి సర్కార్ పని పెట్టుకుందని తెలిపారు.
రైతుల నుంచి భూములు అక్రమంగా గుంజుకుంటుంది….
చిన్న కారు.. సన్న కారు రైతులు సాగు చేసుకుని బతుకుతున్న భూములను బలవంతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాక్కుంటుందని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. లగచర్లలో భూములు ప్రభుత్వానికి అవసరం లేకున్నా బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేసిందని..ప్రభుత్వ ప్రయత్నాన్ని రైతులు అడ్డుకుంటే రైతుల పై కేసులు పెట్టి జైలుకు పంపించారని తెలిపారు. ఫార్మాసిటీ భూములు 14వేల ఎకరాలు ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పటికీ ఇబ్రహీంపట్నం, కందుకూర్, మహేశ్వరం మండలాల్లో 3000 ఎకరాలను తీసుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఆ భూములు ఎందుకోసం తీసుకుంటున్నారో ప్రభుత్వ స్పష్టంగా ప్రకటించడం లేదని పేర్కొన్నారు.. ఫార్మా సిటీలో నాలుగైదు రోడ్లు ఉన్నప్పటికీ మళ్లీ రోడ్డు వేస్తున్నారని ఆ రోడ్డు ఎవరికోసం వేస్తున్నారో ప్రభుత్వం చెప్పడం లేదని ఆమె మండిపడ్డారు. గద్వాలలో సన్నకారు, చిన్న కారు రైతులు సాగు చేసుకుంటున్న భూములను విత్తనాల ఫ్యాక్టరీకి బలవంతంగా కట్టపెట్టే ప్రయత్నం చేస్తుందని.. మా భూములను ఇవ్వమని రైతులు ఆందోళన చేస్తుంటే వారిపై అక్రమంగా లాఠీ ఛార్జీ చేసి 40 మందిపై కేసులు నమోదు చేయడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం సంగారెడ్డిలో రైతుల నుంచి అక్రమంగా భూములను తీసుకుందని.. అదేవిధంగా ఎన్కేపల్లిలో భూములను తీసుకోవడానికి ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఎన్కేపల్లి భూములను తీసుకోవడానికి పోలీసుల పహారాపెట్టి ఆ భూముల్లోనికి ఎవరిని రానివ్వకుండా .. సాగు చేసుకోకుండా అడ్డు పడుతున్నారని చెప్పారు. ఆ భూములు గోశాలకు ఇచ్చామని అధికారులు చెప్పడంతో రైతులు ప్రతిఘటించేరని అన్నారు.
జీ వో 111 పై ప్రభుత్వం స్పష్టత ఇవాళ..
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో 111ను ఎత్తివేస్తూ 69ను విడుదల చేసిందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ జీవో 111 ఎత్తివేయడం జరిగిందని స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 111 ఉందని చెప్పి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ప్రజలపై ప్రభుత్వం ముక్కుపాదం మోపుతుందని అన్నారు. ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 69 ను అమలు చేసి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలని డిమాండ్ చేశారు.