Niranjan Reddy | హైదరాబాద్ : ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్‌కు నీటి విలువ, నోటి విలువ తెలియదు అని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఒకరు, పదవి ఇవ్వలేదని ఒకరు విష ప్రచారం చేశారు. కేసీఆర్‌ను పనికట్టుకుని
స్వయం ప్రకటిత మేధావులు బద్నాం చేశారు. ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును తిట్టారు. నీళ్ల మంత్రికి నల్గొండ తప్ప ఏం తెలియదు. పాలమూరు అల్లుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలి అని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
1982లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ నంబర్ 306 ద్వారా శ్రీశైలం జలాలపై సర్వే చేయాలని చెప్పింది. 1994లోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. 2014 వరకు ఎందుకు ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఎందుకు పూర్తి చేయలేదు. కేసీఆర్‌ను తిట్టడానికి రేవంత్ రెడ్డికి సిగ్గుగా లేదా..? కుడి కాలువ టన్నెల్ జీఓ 110 ద్వారా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేశారు. బిఆర్ఎస్ పార్టీ నీళ్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బయటకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు, రాష్ట్రం పరువు తీస్తున్నారు. పాలమూరు – రంగారెడ్డిపై 190 కేసులు వేశారు అని నిరంజన్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో రైతులు పత్తిని తగలబెడుతున్నారు. వరి ధాన్యం తడిసిపోయింది. అవేమీ పట్టించుకోకుండా కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్
ఓటమి ఖాయం అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.