Yashasvi Jaiswal : టెస్టు క్రికెట్లో సంచలనంగా పేరొందిన యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) పరుగుల వరద పారించేందుకు సిద్దమవుతున్నాడు. ఈమధ్యే వెస్టిండీస్‌పై శతక గర్జన చేసిన విధ్వంసక ప్లేయర్.. దక్షిణాఫ్రికా(South Africa) సిరీస్‌కు ముందే సెంచరీతో హెచ్చరికలు పంపాడు. సఫారీలతో మ్యాచ్ సన్నద్ధతగా దేశవాళీలో ఆడుతున్న యశస్వీ.. భారీ శతకంతో ఫామ్ చాటుకున్నాడు. రంజీ ట్రోఫీలో ముంబై ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ కుర్రాడు రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోసి భారీ శతకం సాధించాడు.
చిన్న వయసులోనే సుదీర్ఘ ఫార్మాట్లో రికార్డులు నెలకొల్పుతున్న యశస్వీ జైస్వాల్ రంజీల్లోనూ తన బ్యాట్ పవర్ చూపించాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ బౌలర్లకు దడపుట్టించాడీ లెఫ్ట్ హ్యాండర్. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ(67)తోనే సరిపెట్టుకున్న రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కసిదీరా కొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 254కే కుప్పకూలిన జట్టును ఓటమి నుంచి తప్పించేందుకు శతకం(156)తో వీరవిహారం చేశాడు యశస్వీ.
🚨JAISWAL RESCUES MUMBAI🚨
Yashasvi Jaiswal smashed 156 off just 174 balls to ensure Mumbai draw against Rajasthan #RanjiTrophy
He is ready for South Africa!! 🔥 pic.twitter.com/Q9czuQXuBF
— Cricbuzz (@cricbuzz) November 4, 2025
ప్రత్యర్థి బౌలర్లను ఉతికేస్తూ 18 బౌండరీలతో సూపర్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఈ పెద్ద ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాతో జరుగుబోయే టెస్టు సిరీస్‌లో తాను సెంచరీలో మెరవడం ఖాయమని చాటాడీ చిచ్చరపిడుగు. అతడి ఫామ్ చూస్తుంటే సఫారీ బౌలర్లకు కూడా పట్టపగలే చుక్కలు కనిపించేలా ఉన్నాయి. యశస్వీ మెరుపు సెంచరీకి, ముషీర్ ఖాన్ అర్ధ శతకం తోడవ్వగా ముంబై, రాజస్థాన్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా నవంబర్ రెండో వారంలో భారత పర్యటనకు రానుంది. నవంబర్ 14న ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్టులో టీమిండియాతో సఫారీ టీమ్ తలపడనుంది. గువాహటిలో నవంబర్ 22 నుంచి రెండో టెస్టు షురూ కానుంది. అనంతరం నవంబర్ 30 నుంచి మూడు వన్డేల సిరీస్.. ఆపై డిసెంబర్ 9 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ మొదలవ్వనుంది.