Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. సింగరేణి నిధులను సీఎం దుర్వినియోగం చేయడంపై ఆయన మండిపడ్డారు. ‘సింగరేణి పైసలు నీ అయ్య సొత్తా రేవంత్‌రెడ్డీ..’ అని ప్రశ్నించారు. సింగరేణి కార్మికులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేక వారు బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాప్ట్‌లు, లోన్ తెచ్చుకుంటుంటే నువ్వు ఆ నిధులను మెస్సీతో ఫుట్‌బాల్ ఆడటానికి ఖర్చు చేస్తవా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
డిపెండెంట్ ఉద్యోగుల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. మొత్తం ఉద్యోగుల్లో సగం మంది డిపెండెంట్ ఉద్యోగులే ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ ఊసే లేదని మండిపడ్డారు. కార్మికులపై కక్ష కట్టినట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
సింగరేణి నిధులను ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మెస్సీ టూర్ కోసం సింగరేణి నిధులు ఎందుకు వాడారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణ చేయిస్తామని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని జైల్లో పెడతామని చెప్పారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలకు ఇవ్వాలని, లేదంటే వారితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇల్లు ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా అక్రిడిటేషన్ కార్డుల కోసం ధర్నా చేసిన జర్నలిస్టుల అక్రమ అరెస్టులను మాజీ మంత్రి ఖండించారు. జర్నలిస్టులకు ధర్నా చేసే హక్కు లేదా.. ప్రశ్నించే హక్కు లేదా..? అని నిలదీశారు. కేసీఆర్ హయాంలో 26 వేల అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.