హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు (Jubilee Hills Bypoll Results) కొనసాగుతున్నది. ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు. ముందుగా షేక్‌పేట డివిజన్లోని ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఎర్రగడ్డ డివిజన్లోని ఓట్లను లెక్కిస్తారు. కాగా, పోస్టల్ ఓట్లలో బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యం సాధించింది. ఓట్ల లెక్కింపునకు మొత్తం 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 10 రౌండ్లలో ఫలితం తేలనుంది. ఒక్కో రౌండ్‌కు 40 నిమిషాలు పట్టనుంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వెలువడనుంది. అయితే 10 గంటల వరకు ఫలితంపై ఒక స్పష్టత రానుంది.
ఈ నెల 11న జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 48.49 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 1,94,631 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 99,771 మంది పురుషులు, 94,855 మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. బోరబండ్ డివిజన్లో 29,760 మంది ఓట్లు వేయగా, రహమత్‌నగర్ డివిజన్లో 40,610 ఓట్లు పోలయ్యాయి. ఇక ఎర్రగడ్డ డివిజన్లో 29,112 ఓట్లు, వెంగళరావ్‌నగర్‌లో 25,195 ఓట్లు, షేక్‌పేట డివిజన్లో 31,182 ఓట్లు, యూసఫ్‌గూడలో 24,219 ఓట్లు, సోమాజిగూడలో 14,553 ఓట్లు పోలయ్యాయి.