KTR | తన ఫొటో, పేరు పెట్టుకున్నారని సిరిసిల్లలో ఓ టీ స్టాల్ మూసివేయించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నానని.. ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇదే మాట మీద ఉంటానని మీకు మాట ఇస్తున్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు టీ షాపు యజమాని బత్తుల శ్రీనివాస్ ఆవేదనతో మాట్లాడుతున్న ఒక వీడియోను షేర్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ బతుకమ్మ ఘాట్ వద్ద గత నాలుగేళ్లుగా ‘కేటీఆర్ టీ స్టాల్’ నడిపిస్తున్నాడు. హోటల్ బోర్డుపై కూడా కేటీఆర్ ఫొటో పెట్టుకున్నారు. ఇది గమనించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆ హోటల్‌ను మూసేయించారు. అసలు ఆ టీ స్టాల్‌కు ట్రేడ్ లైసెన్స్ ఉందా? లేకుంటే హోటల్‌ను సీజ్ చేయండి అంటూ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ హుకుంతో వెంటనే రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది టీ స్టాల్‌ను బలవంతంగా మూసివేయించారు.
Everything shall be remembered
Nothing will be forgotten. I assure you https://t.co/teQEyo0K5b
— KTR (@KTRBRS) February 19, 2025
తన టీ స్టాల్‌ను సీజ్ చేయడంపై బత్తుల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేదన్న కారణంతోనే టీ స్టాల్ మూసివేశామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారని.. కానీ అసలు కారణం అది కాదని తెలిపాడు. కేటీఆర్ ఫొటో తీసేయాలన్న ఆదేశాలు వినకపోవడంతోనే కలెక్టర్ అలా కక్ష కట్టాడని చెబుతున్నాడు. టీ స్టాల్ పోయినా సరే.. నా అన్న కేటీఆర్ ఫొటో తీయనని స్పష్టం చేయడంతోనే ఇలా హోటల్ సీజ్ చేశారని ఆరోపించాడు. కేటీఆర్ ఫోటో ఉందని హోటల్ మూసేయడం ఏ న్యాయం? ప్రజాస్వామ్యమా, లేక కాంగ్రెస్ తుగ్లక్ పాలనా?” అంటూ స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఫొటోలను చూసే కాంగ్రెస్ నాయకులు భయపడిపోతున్నారని సెటైర్లు వేస్తున్నారు.