నాగర్ కర్నూల్ : నీట్ ప్రశ్నా పత్రాల లీకేజి ( NEET Paper Leak ) విషయంలో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ వైఫల్యం స్పష్టంగా ఉందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhar Reddy ) అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, యువకులు, విద్యావేత్తలు ఎంతగా కోరినా కేంద్రం పెడచెవిన పెట్టడం వల్ల పరిస్థితి చేయి దాటిందని పేర్కొన్నారు. వాంగ్ చుక్ దీక్ష విషయంలో, కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదని వెల్లడించారు.
విద్యార్థుల మీద అమానుషంగా ప్రవర్తించడం ప్రతీ భారతీయుడ్ని కదిలించిందని వివరించారు. ప్రజాగ్రహాన్ని గ్రహించే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. అనేక మంది రైతులు మరణించిన తర్వాత సాగు చట్టాలను రద్దు చేసినట్లే, అనేక మంది విద్యార్థులు నష్టపోయిన తర్వాత ధర్మేంద్రతో రాజీనామా చేయించడం మోదీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయిందని విమర్శించారు.
నీట్ లాంటి జాతీయ పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మరింత బాధ్యతగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అనేక విషయాల్లో వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజా రాజకీయ పరిణామాలతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.