యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శనివారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. ప్రతిష్టామూర్తు లకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదనలు అర్పించారు.
స్వామి వారిని సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచి, సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీ రోజు నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజ వాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు.
లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. సాయంత్రం అమ్మ వారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామి వారికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్నక్షేత్రపాలక ఆంజనేయ స్వామికి జరిగిన పూజల్లో కూడా భక్తులు పాల్గొన్నారు.
కొండ కింద పాత గోశాల వద్ద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు పాల్గొని వ్రతమాచరించి మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో నిత్య పూజల కోలాహలం నెలకొంది.
స్వామివారిని దర్శించుకున్న భువనగిరి ఎమ్మెల్యే దంపతులు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు బాలాలయ ముఖ మండపంలో అర్చకులు వారికి స్వామివారి వేద ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.