హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కొత్తగా 4 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌ను ఆధునీకరించడానికి కావల్సిన వసతులను కల్పిస్తామని చెప్పారు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు, తెలంగాణ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో మంగళవారం వెంగళరావు నగర్‌లోని డీసీఏ ఆఫీస్‌లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మష్కలర్ కమిటీ సిఫార్సులకు అ నుగుణంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మెడిసిన్‌కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ, ఆకస్మిక తనిఖీల కోసం స్టేట్ విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లలో డ్రగ్స్‌కు సంబంధించిన ఫిర్యాదుల కోసం కైంప్లెంట్ సెల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 4 కొత్త ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం 71 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లకు ఇంకో 80 మంది సిబ్బందిని పెం చుతామని చెప్పారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లను వారు పనిచేస్తున్న ప్రాంతానికే పరిమితం చేయకుం డా.. ఇతర ప్రాంతాల్లో తనిఖీకు పంపించాల ని డీజీ కమలాసన్‌రెడ్డికి సూచించారు. దవాఖానలకు వచ్చే మందులు నాణ్యంగా ఉండే లా డీసీఏ, టీజీఎంఎస్ఐడీసీ చర్యలు తీసుకోవాలన్నారు. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొం గ్తూ, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ సహదేవరావు, డీసీఏ జేడీ రాందాన్ పాల్గొన్నారు.