రాయపర్తి, జనవరి 4: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో యూరియా పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు యూరియా బస్తాల కోసం పడుతున్న ఇబ్బందులను ఎర్రబెల్లికి వివరించగా, వెంటనే ఆయన వ్యవసాయాధికారులతో ఫోన్లో మాట్లాడారు.
రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా బస్తాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. మంత్రులంతా రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని ప్రకటనలు గుప్పిస్తున్నారని, కానీ, రాష్ట్రంలో ఎక్కడా రైతులకు కావల్సినన్ని యూరియా బస్తాలు అందడంలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా బస్తాలు, సాగు నీరు, ఎరువులు, పురుగు మందులు అందక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా అందించాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

లింగాల, జనవరి 4 : నాగర్కర్నూల్ జిల్లా లింగాల పీఏసీసీఎస్ ఎదుట ఆదివారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. వ్యవసాయాధికారులు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి యూరియా పంపిణీ చేపట్టారు. ఎకరాకు మూడు బస్తాలు మాత్రమే ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అవసరమైనంత యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
రామాయంపేట, జనవరి4: మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రానికి ఆదివారం తెల్లవారుజామునే రైతులు చేరుకున్నారు. మూడు గంటలపాటు వేచి ఉండగా ఒకే లారీ యూరియా రావడంతో రైతులకు తలా రెండు బ్యాగులు మాత్రమే అధికారులు అందజేశారు. కొందరు రైతులకు యూరియా లభించక నిరాశతో వెనుదిరిగారు.