Harish Shankar | మాస్ మహారాజ రవితేజకు గత కొంతకాలంగా ఆశించిన స్థాయి విజయాలు దక్కడం లేదు. వరుస పరాజయాల నేపథ్యంలో అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. ఇలాంటి సమయంలో సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాపై రవితేజ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా రవితేజకు చిరకాలంగా అంటుకుపోయిన ‘మాస్ మహారాజ’ ట్యాగ్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఈ సినిమాలో రవితేజ పేరుతో పాటు ‘మాస్ మహారాజ’ ట్యాగ్ వాడడం లేదని, అది హీరో స్వయంగా తీసేయమన్నారనే వార్తలు వినిపించాయి. ఈ ప్రచారంపై స్పందించిన హరీష్ శంకర్, “రవితేజకు మాస్ మహారాజ అనే గుర్తింపుని ఇచ్చింది నేనే. ఆ ట్యాగ్‌కి సంబంధించిన క్రియేటివ్ హక్కులు నా దగ్గరే ఉన్నాయి. దాన్ని ఉంచాలా, తీసేయాలా అన్నది హీరో ఇష్టం. కానీ ఆ పేరు ఆపేయాలని ఎవరు ప్రయత్నించినా అది అంత సులువు కాదు” అంటూ సరదాగానే కాస్త గట్టిగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త చర్చకు దారి తీశాయి.
అంతేకాదు, రవితేజ వ్యక్తిత్వంపై హరీష్ శంకర్ చేసిన ప్రశంసలు కూడా ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా రవితేజలో ఎలాంటి మార్పు ఉండదు. ఒక రోజు ఫలితం ఎలా ఉన్నా, మరుసటి రోజు షూటింగ్‌కు అదే ఎనర్జీతో వస్తాడు. ఇదే నిజమైన స్థితప్రజ్ఞత” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ లక్షణం తాను పవన్ కళ్యాణ్‌లో చూసిన తర్వాత మళ్లీ రవితేజలోనే కనిపించిందని చెప్పారు. తనతో రవితేజ చేసిన చివరి సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదని, అది తనను కొంత నిరాశపరిచిందని హరీష్ శంకర్ ఓపెన్‌గా చెప్పారు. అయితే అక్కడితో ఆగకుండా, రవితేజతో మరోసారి తప్పకుండా బ్లాక్‌బస్టర్ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నానని స్పష్టం చేశారు. “అది నేను నాకే చేసుకున్న వాగ్దానం” అని చెప్పడం గమనార్హం.ఈ వ్యాఖ్యలతో రవితేజ–హరీష్ శంకర్ కాంబినేషన్లో మరో సినిమా ఖాయమనే సంకేతం అందింది.