హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో టేకోవర్ పరిస్థితి ‘దున్నబోతే దూడ, మోయబోతే ఎద్దు’ చందంగా మారింది. మెట్రోరైలు మొదటి దశను ఎల్అండ్టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకోవాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వంద రోజు ల్లో మెట్రోను స్వాధీనం చేసుకొని, రెండో దశను పట్టాలెక్కించడానికి అనుమతులు సాధిస్తామని ఏడాది నుంచి ప్రభుత్వం ఊరిస్తూనే ఉన్నది. తీరా ఇప్పుడు నిధులు సర్దుబాటు చేయలేక తండ్లాడుతున్నది. నిధుల సమీకరణ హెచ్ఎంఆర్ఎల్కు తలకు మించిన భారంగా మారింది.
మెట్రో మొదటి దశను టేకోవర్ చేయాలంటే ప్రభుత్వం రూ.15వేల కోట్లను సర్దుబాటు చేసుకోవాలి. ఇందులో రూ.2 వేల కోట్లు హెచ్ఎంఆర్ఎల్కు చెల్లించగా, మిగిలిన మొత్తానికి అప్పు రూపంలో నెలవారీ భారాన్ని మోయాల్సి ఉంటుంది. మెదటి దశ స్వాధీనం కోసం జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల వెంట పడుతున్న ప్రభుత్వానికి ‘వయబిలిటీ’ అంశం అతిపెద్ద అడ్డంకిగా మారింది. గతంలోనే రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) ఈ ప్రాజెక్టును పరిశీలించి ఆదాయం, ని ర్వహణ వ్యయం లెక్కలేసింది. లాభసాటి కాదంటూ రుణాల మంజూరుకు విముఖత వ్యక్తంచేసింది. అయినా మెట్రో ఉన్నతాధికారులు ప్రతి ఫైనాన్స్ సంస్థ చుట్టూ తిరుగుతూ నిధుల సర్దుబాటుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తులో పెరిగే ప్రయాణికుల రద్దీని వివరిస్తూ, రుణం కోసం మల్లగుల్లాలు పడుతున్నా ఫలితం కనిపించడంలేదు.
మెట్రో మొదటిదశ నుంచి ఎల్అండ్ టీ కంపెనీ బయటపడటానికి ఆర్థిక భారం ప్రధాన కారణమని చెప్తున్నారు. ఈ అం శంపై ఏ మాత్రం అవగాహన లేకుండానే ప్రభుత్వం స్వాధీన ప్రతిపాదనలను తెరమీదకు తీసుకొచ్చిందని నిపుణులు విమర్శిస్తున్నారు. వచ్చే ఆదాయం ఎంత? రుణాల రూపంలో సర్కార్‌పై పడే భారం, నిధుల సర్దుబాటు వంటి అంశాలను ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నా రు. ముందస్తు ప్రణాళిక లేకుండానే, భవిష్యత్తులో గుదిబండలా మారే మెట్రోను ప్రభుత్వం ఏ విధంగా నిర్వహిస్తుందనేది అంతుచిక్కని ప్రశ్నే. అప్పులిచ్చే సంస్థల కోసం ప్రభు త్వం ఎదురుచూస్తూనే ఉన్నది. రుణం దొరికేదాకా స్వాధీన గడువును పొడిగిస్తూనే ఉంటారని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు.
మెట్రో రెండోదశ విస్తరణకు ఇప్పటికే సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. పార్ట్-ఏలో భాగంగా నాగోల్ నుంచి ఎయిర్‌పోర్టు, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపొలిస్, ఎంజీబీఎస్ నుంచి చాం ద్రాయణగుట్ట, మియాపూర్ నుంచి పటాన్చెరు, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 76.4 కిలోమీటర్ల మెట్రో మార్గానికి రూ.25 వేల కోట్ల అంచనాతో డీపీఆర్ సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించాల్సి ఉన్నది. పార్ట్-బీలో మరో 85 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గం నిర్మించేలా డీపీఆర్ సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుకు మరో రూ.40వేల కోట్లు అవసరం. మొదటి దశ స్వాధీనానికే రుణాలు అందని తరుణంలో రెండు, మూడో దశలు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.