హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): ప్రజలకు రేషన్ తిప్పలు తప్పడం లేదు. రేషన్‌షాపులు తెరుచుకోక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. సకాలంలో బియ్యం సరఫరా కాక డీలర్లు దుకాణాలు మూసేస్తుండటంతో సగం రేషన్ షాపులు మూసే ఉంటున్నాయి. రాష్ట్రంలో 17,326 రేషన్ దుకాణాలు ఉండగా శనివారం సాయంత్రం 9వేలు మాత్రమే తెరిచి ఉన్నాయి. ఏకంగా 8వేల పాపులు బంద్ ఉండటంతో ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారో, ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొన్నది. దీంతో లబ్ధిదారులు తీవ్రమైన ఎండలోనూ దుకాణాలు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది.
బియ్యం సరఫరా ఆలస్యం
ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా, సమయానికి సరఫరా చేయడంలో సివిల్‌సప్లయ్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలున్నాయి. సకాలంలో స్టాక్ రావడం లేదని, అందుకే దుకాణాలు మూసేస్తున్నామని రేషన్ డీలర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో 1.05 లక్షల రేషన్‌కార్డులు ఉండగా వీటికి పంపిణీ కోసం ప్రతినెలా 2.3 లక్షల టన్నుల బియ్యం అవసరం. అంటే మూడు నెలలకు గానూ 6.9 లక్షల టన్నుల కావాలి. అయితే సరిపడా నిల్వలను ఇప్పటికే సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నా, గోదాముల నుంచి డీలర్ల వద్దకు చేరడంలో రవాణా సమస్యలున్నట్టు తెలిసింది.
ఎండలోనూ భారీ క్యూలు..
తెరిచి ఉన్న సగం షాపుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. మూడుసార్లు వేలిముద్ర వేయాల్సి వస్తున్ననందున ఒక్కొక్కరికి కనీసం 10 నిమిషాల సమయం పడుతున్నదని డీలర్లు చెబుతున్నారు. అందుకే షాపుల ముందు క్యూలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దీనికి తోడు ఈ-పాస్ మిషన్లలో సాంకేతిక సమస్యల కారణంగా మరింత ఆలస్యమవుతున్నది. ఓవైపు గంటల తరబడి క్యూలో ఉండడం మరోవైపు బయట ఎండలు మండిపోతుండడంతో తట్టుకోలేక సొమ్మసిల్లుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బియ్యం పంపిణీ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.