హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తేతెలంగాణ): మనస్తాపంతో కుప్పకూలి దవాఖానలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిపై దుర్భాషలాడిన ఆ శాఖ కమిషనర్ వైఖరిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. బాధ్యాతాయుతమైన హోదాలో ఉన్న అధికారి తన శాఖలోని మరో అధికారిని దూషించడం దుర్మార్గమని సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. శాఖాపరంగా ఇబ్బందులుంటే సంబంధిత మంత్రి, ఆపైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి తప్ప దురుసుగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సదరు అధికారి గతంలోనూ అనేకసార్లు తన శాఖలోని ఉద్యోగులు, సిబ్బందిపై నోరుపారేసుకొన్నారని ఆరోపిస్తున్నారు.
దురుసు, దుందుడుకు వ్యవహార శైలితో ఆయన చాంబర్‌కు వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తున్నదని పేరు చెప్పని ఆ శాఖలోని ఓ ఉద్యోగి వాపోయారు. చిన్నపాటి లోపాలను చూపుతూ స్థాయి మరచి తిట్లదండకం అందుకుంటారని చెప్తున్నారు. ఆయన నిర్వాకానికి ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులు గుండెపోటుకు గురయ్యారని, తాజాగా సోమిరెడ్డి సైతం కుప్పకూలారని గుర్తుచేస్తున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన సదరు ఉన్నతాధికారికి తెలంగాణ ప్రాంత అధికారులన్నా, ఉద్యోగులన్నా చులకనభావం ఉన్నదని ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత మంత్రి కూడా పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి సోమిరెడ్డి ఉదంతంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సోమిరెడ్డికి ఏం జరిగినా కమిషనర్‌దే బాధ్యత: దేవీప్రసాద్
ఎైక్సెజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డితోపాటు తెలంగాణ అధికారులు, ఉద్యోగులపై ఆ శాఖ కమిషనర్ దౌర్జన్యం చేయడం దుర్మార్గమని ఉద్యోగ సంఘాల మాజీ నేత దేవీప్రసాద్ పేర్కొన్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్న సోమిరెడ్డికి ఏమి జరిగిన ఎైక్సెజ్ కమిషనర్‌తో పాటు ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.
కమిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి : లచ్చిరెడ్డి, రాజశేఖర్
ఆబ్కారీ శాఖ డీసీ సోమిరెడ్డిని అకారణంగా దూషించిన కమిషనర్‌పై కఠిన చర్యలు తీసు కోవాలని ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ రాజశేఖర్ డిమాండ్ చేశారు. తోటి అధికారి అని చూడకుండా పరుష పదజాలంతో దూషించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఇష్టారాజ్యంగా దూషించే హక్కు ఆయనకు ఎవరిచ్చారని నిలదీశారు. కమిషనర్ తీరుతోనే సోమిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి, ఎైక్సెజ్ శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని స్పష్టంచేశారు.