రుద్రంపూర్, జూన్ 05 : పర్యావరణ పరిరక్షణ ఇస్లాం మతంలో ఒక ముఖ్యమైన బాధ్యత మాత్రమే కాకుండా ఆరాధనలో భాగమని జమాతే ఇస్లామి హింద్ సభ్యుడు షేఖ్ అబ్దుల్ బాసిత్ అన్నారు. పవిత్ర శుక్రవారం సందర్భంగా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మస్జిద్-ఎ-ఖుబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ఆయన మాట్లాడారు. సృష్టికర్త అల్లాహ్ ఈ విశ్వాన్ని మానవ మనుగడ కోసం సమతుల్యంగా సృష్టించాడని, ఆ సమతుల్యతకు భంగం కలగకుండా ప్రకృతి వనరులను అవసరమైన మేరకే వినియోగించాలని పవిత్ర ఖురాన్ బోధిస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి వ్యక్తి బాధ్యత అని 1,450 సంవత్సరాల క్రితమే ప్రవక్త ముహమ్మద్ (స.అ.వ.) బోధించారన్నారు. ప్రవహించే నది ఒడ్డున ఉన్నప్పటికీ నీటిని వృథా చేయరాదని, పరిశుభ్రత విశ్వాసంలో సగభాగమని ఇస్లాం ఉపదేశిస్తోందన్నారు. భూమిపై ఒక మొక్క నాటిన వారికి అల్లాహ్ స్వర్గంలో ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడని, మనం పెంచిన చెట్ల ద్వారా జీవరాశులు పొందే ప్రయోజనం ఉన్నంతకాలం వాటిని నాటిన వారికి పుణ్యఫలాలు లభిస్తాయని ప్రవక్త బోధించారని వివరించారు.
ప్రళయం సంభవించబోతున్నదని తెలిసినా చేతిలో ఉన్న మొక్కను నాటాలని ప్రవక్త చెప్పడం ద్వారా చెట్ల పెంపకం ప్రాముఖ్యతను చాటారన్నారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి వ్యక్తి బాధ్యత అని స్పష్టం చేశారు.
రాబోయే తరాలకు అందించగల అత్యున్నత బహుమతి స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన వాతావరణమని పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేయడం వల్ల కాలుష్యం, వాతావరణ మార్పులు వంటి అనర్థాలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మాత్రమే కాకుండా ప్రతి రోజూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మసీదు ఇమామ్ మౌలానా మజ్హార్, సోనుబాయ్, అక్బర్ ,మదార్, తాజుద్దీన్, రఫీ, ఉమర్, ఖలీల్ అహ్మద్, షుకూర్, షఫీ పాల్గొన్నారు.

ఇస్లాంలో పర్యావరణ పరిరక్షణ కూడా ఆరాధనే : షేఖ్ అబ్దుల్ బాసిత్