రుద్రంపూర్, జూన్ 05 : రుద్రంపూర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో తగినంత నగదు అందుబాటులో లేకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శాఖ మేనేజర్‌కు గురువారం రుద్రంపూర్ ఉప సర్పంచ్ తోట సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ప్రస్తుత నెల ప్రారంభంలో సింగరేణి ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, పెన్షనర్లు తదితర ఖాతాదారుల ఖాతాల్లో జీతాలు, ఇతర నెలవారీ చెల్లింపులు జమ అయినప్పటికీ, శాఖలో నగదు కొరత కారణంగా అవసరమైన మొత్తాన్ని ఉపసంహరించుకోలేకపోతున్నామని వారు పేర్కొన్నారు. గత నెలల్లో ఇటువంటి సమస్య ఎదురుకాలేదని, ఈ నెలలో మాత్రమే నగదు కొరత ఏర్పడిందని తెలిపారు.
ఇంటి ఖర్చులు, వైద్య అవసరాలు, విద్యా ఫీజులు తదితర అత్యవసర అవసరాల కోసం నగదు ఉపసంహరణలు చేయాల్సి ఉండడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఖాతాదారులు తమ సొంత నిధులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొందేందుకు శాఖలో తగినంత నగదు అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని శాఖ మేనేజర్ వెంకటరమణను కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో లడ్డ అజయ్, మున్వర్, హనుమంతు ఉన్నారు.