తిరుమల : తిరుమల, తిరుపతిలోని టీటీడీ ఆసుపత్రుల్లో ( TTD Hospitals ) శ్రీవారి వైద్య సేవ ( Srivari Vaidya Seva ) కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్‌ను టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు.
ప్రయోగాత్మక దశలో కార్యక్రమాన్ని అమలు చేసి, పాల్గొనే వైద్య నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించి మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు విద్య, వైద్యం, ఐటీ తదితర రంగాల్లో సేవా భావంతో ముందుకు వచ్చే నిపుణులకు టీటీడీ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. టీటీడీ ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో సేవలందించేందుకు వచ్చే నిపుణులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, వైద్య నిపుణులు తమకు అనుకూలమైన తేదీల్లో ఆన్లైన్లో నమోదు చేసుకుని సేవలందించవచ్చని సూచించారు. సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులకు మూడు రోజుల పాటు, ఎంబీబీఎస్ వైద్యులకు ఏడు రోజుల పాటు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. వీరికి తిరుమల, తిరుపతిలో వసతి, భోజన సౌకర్యాలు టీటీడీ ద్వారా అందిస్తామన్నారు.
అశ్విని ఆసుపత్రి, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, ఎస్వీ గోశాల తదితర టీటీడీ అనుబంధ సంస్థల్లో వైద్య నిపుణులు తమ సేవలను అందించవచ్చని పేర్కొన్నారు. హిందూ మతానికి చెందిన ఆసక్తిగల వైద్య నిపుణులు ఆన్లైన్ ద్వారా టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/srivari-seva/instructions లో తమ స్లాట్‌ను బుక్ చేసుకుని సేవలో పాల్గొనవచ్చని తెలిపారు.