రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస రాజ్యం నడిపిస్తోందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి విమర్శించారు. రైతుల పక్షాన వరంగల్ లో కేటీఆర్ ప్రశ్నిస్తే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏనుగుల రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్ అమలు చేయకపోతే రైతులకు క్షమాపణ చెప్పాలని.. కానీ ఈ చేతగాని దద్దమ్మలు మాత్రం కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఐకేపీ సెంటర్ల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడాలని ఏనుగుల రాకేశ్ రెడ్డి సూచించారు. ఎన్ని కేసులు పెట్టినా.. జైలుకు పంపించినా భయపడమని స్పష్టం చేశారు. మా మీద కక్ష ఉంటే కేసులు పెట్టండి కానీ రైతుల జోలికి పోవద్దని సూచించారు. వరి ధాన్యాల కల్లాల్లో చనిపోతున్న రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీపై ఎన్ని కేసులు పెట్టాలని నిలదీశారు. రైతులను కాపాడుకోవడానికి ఎన్ని కేసులను ఎదుర్కోవడానికికైనా కేటీఆర్ సిద్దమని స్పష్టం చేశారు. తెలంగాణ ద్రోహులపై దురంధరుడు కేటీఆర్ పోరాటం చేస్తున్నారని తెలిపారు. కేటీఆర్ రైతు సంగ్రామ సదస్సులో 20 వేల మంది పాల్గొన్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన రైతు మేళాలో రెండు వేల మంది కూడా హాజరుకాలేదని పేర్కొన్నారు. నువ్వు కేసులు పెడితే కేటీఆర్ భయపడతారా అని మండిపడ్డారు. బీఆర్ఎస్ పేరు చెబితేనే కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు.
రైతుబంధు వేయకుండా రైతులను కాంగ్రెస్ సర్కా్ర్ మోసగిస్తుందని ఏనుగుల రాకేశ్ రెడ్డి తెలిపారు. 2024లో ఎకరానికి 15 వేలు ఎగ్గొట్టారని.. 2025లో 7 వేలు ఎగ్గొట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు బిచ్చగాళ్లకు వేసినట్లు రైతు బంధు వేస్తున్నారని అన్నారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి పాలనలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దిగజారిందని రాకేశ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని అన్నారు. ఐకేపీ సెంటర్లు,మార్క్ ఫెడ్ సెంటర్లలో పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. మొక్కజొన్నలో క్వింటాల్ కు రైతు 900 రూపాయలు నష్ట పోతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి గజినీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ఒళ్ళు అంతా పచ్చబొట్లు పొడవాలని ధ్వజమెత్తారు.
సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని కేసీఆర్ సంక్షేమం వైపునకు తీసుకెళ్లారని రాకేశ్ రెడ్డి తెలిపారు. కానీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతులు వలస వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి అసలు సిగ్గు ఉందా అని ధ్వజమెత్తారు.
పౌర సరఫరాలో పెద్ద స్కామ్ జరిగిందని ఏనుగుల రాకేశ్ రెడ్డి ఆరోపించారు. మంత్రులు సివిల్ సప్లైస్ స్కామ్ లో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అవినీతి అక్కడ ఉంటుందని విమర్శించారు. తెలంగాణ ఖజానాను ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపైనర్ కాదు స్టార్ డిస్ట్రిబ్యూటర్ అని ఎద్దేవా చేశారు.