NTR | టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ప్రస్తుతం ఒక ఫోటో భారీ చర్చకు దారితీసింది. ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ తాజాగా తన సామాజిక మాధ్యమ ఖాతాలో పంచుకున్న తారక్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బ్లాక్ అండ్ వైట్‌లో కనిపించిన ఈ స్టైలిష్ చిత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలో తారక్ మరింత సన్నగా, స్టైలిష్‌గా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తడి జుట్టు , ప్రత్యేకమైన గడ్డం , నోట్లో టూత్‌పిక్‌తో కనిపించిన తారక్ అవతార్ అభిమానుల్లో భారీ క్రేజ్ తీసుకొచ్చింది. ఇది మాస్ లుక్కు కొత్త నిర్వచనం, తారక్ స్టైల్ మరో స్థాయిలో ఉంది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’లోని లుక్ ఇదేనంటూ ఫ్యాన్స్ మధ్య చర్చ మొదలైంది. అయితే ఈ ఫోటో నిజంగా ఆ సినిమా లుక్కే సంబంధించినదా? లేదా అనేది ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయినప్పటికీ అభిమానులు మాత్రం ఇదే తారక్ కొత్త అవతార్ అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ ఫోటోను పంచుకున్న తమన్‌కు అభిమానులు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నారు. దీంతో మరోసారి తారక్–తమన్ బాండింగ్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి కాంబినేషన్‌కు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
గతంలో బాద్ షా, రామయ్య వస్తావయ్యా, రభస, టెంపర్, అరవింద సమేత వంటి చిత్రాలకు తమన్ సంగీతం అందించారు. ముఖ్యంగా తారక్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా సంగీతాన్ని అందించడంలో తమన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ చిత్రాల పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ కూడా పలు సందర్భాల్లో తారక్‌పై తన అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. తారక్‌ను “అన్న” అని సంబోధిస్తూ ఆయనపై ఉన్న గౌరవాన్ని వెల్లడించారు. నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తారక్ ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి అని పలుమార్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా అరవింద సమేత సినిమా సమయంలో జరిగిన సంఘటనను తమన్ తరచూ గుర్తుచేసుకుంటుంటారు. తండ్రి నందమూరి హరికృష్ణ మరణించిన తర్వాత కూడా షూటింగ్‌కు హాజరై తన వృత్తి పట్ల చూపిన నిబద్ధత తనను ఎంతో కదిలించిందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.