భూత్పూర్: గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ( Employment guarantee ) వేగవంతం చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ( MLA Madhusudhan Reddy ) కోరారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందితో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం పూర్తి వివరాలను కోరారు. దాదాపు 25 వర్కులకు సంబంధించిన వివరాలను ఏపీవోలు వివరించారు .
ఉపాధి హామీ పనుల్లో ఉన్న పనులకు, వాటి ఎస్టిమేషన్ డబ్బులకు పొంతన లేకపోవడంతో పనులు చేయడంలో రైతులు ముందుకు రావడం లేదని ఏపీవోలు వివరించారు. పనులు, వాటికి డబ్బులను కేటాయించడం 2011 నుంచి ఇప్పటివరకు అవే ధరలు నడుస్తున్నట్లు తెలిపారు. ఈజీఎస్ ద్వారా మంజూరయ్యే సీసీ రోడ్లకు, డ్రైనేజీలు ముందుగానే నిర్మించాలని ఎమ్మెల్యే సూచించారు.
ముందు డ్రైనేజీ నిర్మిస్తే అనంతరం రోడ్లు వేస్తే రోడ్లపై ఉన్న నీరు డ్రైనేజీలకు వెళ్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రతిపాదనలతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవోలు విమల, పులేందర్, వెంకటేష్, నవీన్, రాములు, ఈసీ శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి లిక్కి విజయ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.