ఎన్నికల సంఘం ఇప్పుడు ఓ తుపాన్లో చిక్కుకున్నది. అది పూర్తిగా స్వయంకృతమేనని చెప్పాలి. స్వతంత్ర సంస్థగా కొనసాగుతూ, రాజకీయ పార్టీల మధ్య నిఖార్సయిన నిష్పాక్షికతతో వ్యవహరించాల్సిన సంస్థ ఇప్పుడు తన విశ్వసనీయత అనుమానాల సాలెగూడులో చిక్కుకోగా గిలగిలలాడుతున్నది. ఇందుకు ఈసీదే పూర్తి బాధ్యత. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) పేరిట లక్షల ఓట్ల తొలగింపు, చట్టబద్ధత లేకుండా కొత్త ఓటర్ల ఫారాల్లో మార్పులు చేయడం, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లోపించడంతో మొత్తం మీద కమిషన్ పనితీరు మసకబారింది.
పాలకపక్షంతో మిలాఖత్ లేకుండా ఇవన్నీ జరుగవనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. పరిస్థితులను పైపైన గమనించినా ఇందులో నిజం లేకపోలేదని అర్థమవుతుంది. అబద్ధాల మీద అబద్ధాలు పేరుకుపోతుండటమే అందుకు కారణం. వివాదాస్పద నిర్ణయాలు ప్రధాన ఎనికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా తీసుకున్నవేనని, మిగతా ఇద్దరు కమిషనర్లు గత పది మాసాల కాలంలో 14 సార్లు రకరకాల రీతుల్లో అభ్యంతరాలు నమోదు చేసినట్టు వార్తలు గుప్పుమనడంతో దేశం నివ్వెరపోయింది. ఈ తగాదాపై చివరకు వారు కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి ఫిర్యాదు చేయాల్సి రావడం ఆలోచించాల్సిన విషయమే.
‘భిన్నాభిప్రాయాలు’ వ్యక్తమైనప్పటికీ అంతిమంగా ‘ఏకాభిప్రాయం’ ద్వారానే నిర్ణయాలు జరిగినట్టు కమిషన్ సంజాయిషీ ఇచ్చుకోవడం హాస్యాస్పదం. ఈ సమర్థన సీఈసీ పాత్రపై సందేహాలను బలపర్చిందే తప్ప తగ్గించలేకపోయింది. ఇంతకూ ఈసీల మధ్య భిన్నాభిప్రాయాలు ఎందుకు వచ్చాయి? అందులో కీలకమైంది ఫామ్ 6కు సంబంధించిన డిక్లరేషన్ ముఖ్యమైనది. ఓటర్లుగా నమోదు చేసుకునేవారు తాముగానీ, తమ తల్లిదండ్రులు గానీ చివరిసారి జరిగిన సర్ ప్రక్రియలో నమోదై ఉన్నట్టుగా డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన అందులో చేర్చారు. ఈ మార్పునే కమిషనర్లలో ఒకరైన సుఖ్బీర్సింగ్ సంధూ అనధికారికమూ, చట్టవిరుద్ధమూ అని పేర్కొన్నట్టు మీడియా రాసింది. అయితే దీనిపై వివాదం చెలరేగిన నేపథ్యంలో కమిషన్ ఓ ఖండన లేదా వివరణ లాంటిది వెలువరిస్తూ, సుప్రీంకోర్టు సదరు మార్పును సమర్థించినట్టు చెప్పుకొచ్చింది. అయితే సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించిన డిక్లరేషన్, ప్రస్తుతం కమిషన్ పంపిణీ చేస్తున్న డిక్లరేషన్ రెండూ ఒకటి కాకపోవడం గమనార్హం. కమిషన్ ఎంతో కష్టపడి సమర్పించుకున్న సమర్థన కూడా ఉత్తుత్తిదే అని తేలిపోయింది.
ఒకప్పుడు ఉన్నదో లేదో అన్నట్టుగా ఎన్నికల సంఘం తన పని తాను చేసుకుపోయేది. ఆరోపణలు అసలే రాలేదని చెప్పడం కాదుగానీ, వివాదాలు ఈ స్థాయిలో ముసరడం అసాధారణ పరిణామమే. కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి గండిపడి సంకీర్ణ రాజకీయాల యుగం మొదలైన తర్వాత కమిషన్ పాత్రకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే సీఈసీగా టీఎన్ శేషన్ చుక్కలు చూపించారు. సర్కస్‌లో రింగ్ మాస్టర్ సింహాలను ఆడించినట్టుగా శేషన్ పార్టీలను కట్టడి చేసేవారు.
ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి అంటే ఏందో చాటిచెప్పి చరిత్రకెక్కారాయన. కానీ ప్రస్తుతం ‘ఆకాశంబందుండి శంబుని శిరంబందుండి’ అన్నట్టుగా కమిషన్ ప్రతిష్ట మంటగలిసి బజారుకెక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పేరుపొందిన భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ అబద్ధాలు, ఆపై బుకాయింపులు, దబాయింపుల స్థాయికి పడిపోయింది. నిష్పాక్షికతకు, నిజమైన తటస్థతకు పేరొందిన ఎన్నికల సంఘం పాలకపక్షం బంటులా, ఏజెంటులా మారిందని విపక్షం ఆరోపిస్తున్నది. అందుకే సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ అరెస్టుకు డిమాండ్ చేస్తున్నది. ఆయన అభిశంసనకు, తొలగింపునకు ఒత్తిడి అంతకంతకూ పెరుగుతున్నది. సీఈసీకి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ నిబంధనలు తెచ్చిన బీజేపీ సర్కార్, అందుకు ఏ మేరకు కలిసివస్తుందో ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే.