తుంగతుర్తి, జూలై 18 : తుంగతుర్తి మండల పరిధిలోని బండ రామారం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెంచుటకు, గ్రామస్తులమంతా పార్టీలకతీతంగా కృషి చేస్తామని, ఉపాధ్యాయ బృందం ఐకమత్యంతో పని చేయాలని స్థానిక సర్పంచ్ కొరికొప్పుల నరేష్ గౌడ్ అన్నారు. శనివారం బండ రామారం సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దల సహకారంతో, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఇంటింటికి తిరిగి, పాఠశాలకు 9 మంది విద్యార్థులు హాజరయ్యేలా చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన రెండు సంవత్సరాలుగా పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్ మధ్య సఖ్యత లోపించదని దీని కారణంగానే, పరిస్థితులు టీసీలు ఇవ్వడానికి దారితీశాయని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
జరిగిన సంఘటనపై డీఈఓ కు వినతి పత్రం అందజేశామని తెలిపారు. గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు రాజకీయాలకతీతంగా పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ పంచాయతీ తరపున ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద తాటికొండ సీతయ్య విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోడేటి యాదగిరి, ఉపాధ్యాయులు కోటయ్య, శ్రీనివాస్, నరేష్, లింగన్న, మహేందర్, లింగస్వామి, రాజు, వెంకన్న, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.