కుభీర్ : వర్షాకాలం పూర్తయ్యేంతవరకు మూడు నెలలపాటు గ్రామీణ ప్రాంత ప్రజలు డెంగ్యూ ( Dengue ) , మలేరియా ( Malaria ) వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మండల పంచాయతీ అధికారి మోహన్ సింగ్ ( Mohan Singh ) తెలిపారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం గొడ్సరా, పాంగ్రా, కుప్టి తదితర గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులతో కలిసి గ్రామాల్లో మంగళవారం పర్యటించారు.
పలు గ్రామాల్లో ఇంటి ఎదుట నిలిచి ఉన్న నీటిని, టైర్లు, కుండీలలో నిల్వ ఉన్న నీటిని తొలగింప చేశారు. సందర్భంగా గ్రామస్థులతో ఆయన మాట్లాడుతూ దోమల బారిన పడకుండా పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. వర్షాకాలంలో వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురికి కాల్వలను , ప్రధాన వీధులను పరిశీలించారు. గ్రామంలో రోడ్ల వెంబడి నీరు నిలిచిన గుంతల్లో మొరం వేయించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. సెక్రటరీ సాయి, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు ఉన్నారు.