నీలగిరి, జూన్ 10 : నీటి పారుదల, రహదారులు, వ్యవసాయం అన్ని రంగాల్లో నల్లగొండ జిల్లాను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయం ఇందిరా భవన్లో జిల్లా అధికారులతో సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, ధాన్యం సేకరణ తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. నల్లగొండ జిల్లా అంతటికి సాగునీరు అందించి జిల్లాను సస్యశ్యామలం చేయడమే ధ్యేయమని, అందుకే ఏఎంఆర్పీ కాల్వల లైనింగ్, బ్రాహ్మణ వెళ్లెముల, ఎస్ఎల్బీసీ సొరంగం వంటివి చేపట్టినట్లు తెలిపారు. బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు కింద పెండింగ్లో ఉన్న మైనర్లు, సబ్ మైనర్లపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాగా నార్కెట్పల్లి మండలం, కొండపాకోనిగూడెంలో ఒక రైతుకు సంబంధించిన పొలంలో 40 మీటర్ల మేర కాలువ పనులు ఆగిపోయిన విషయం అధికారులు మంత్రికి దిష్టికి తీసుకురాగా, జిల్లా కలెక్టర్ నిధుల నుండి రైతుకు నష్ట పరిహారం మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి అక్కడికక్కడే కలెక్టర్ ను ఆదేశించారు. కొండపాకోనిగూడెం చెరువు నిండితే దోమలపల్లి చెరువు నిండుతుందని, తద్వారా ఇతర చెరువులు నింపుకునేందుకు అవకాశం ఉందని, మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు.

అన్ని రంగాల్లో నల్లగొండను అభివృద్ధి పరిచేందుకు కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ధాన్యం సేకరణలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం పట్ల ఆయన జిల్లా కలెక్టర్ ను అభినందించారు. నల్లగొండ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని, అయితే ప్రతి సీజన్లో రైతులు వరినే పండించకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పంట మార్పిడిపై అధికారులతో పాటు, మహిళా సంఘాలు అందరూ అవగాహన కల్పించాలన్నారు. ఆర్ అండ్ బి రహదారులపై సమీక్ష సందర్భంగా నార్కెట్పల్లి వద్ద ఆర్ఓబి పనులు చేపట్టేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, మిగిలిపోయిన భూసేకరణకు సంబంధించి చెల్లింపులు చేసి పిఎన్ జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేస్తూ పనులు వేగవంతం చేసేందుకు కలెక్టర్ వద్ద ఉన్న నిధులను వినియోగించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్ రెడ్డి, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పిచ్చయ్య, పౌర సరఫరాల డీఎం రామ్పతి నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.