రామగిరి, సెప్టెంబర్ 17 : విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. విశ్వకర్మ భగవాన్ జయంతిని పురస్కరించుకుని నల్లగొండలోని విశ్వబ్రాహ్మణ విద్యార్ధి వసతి గృహంలో బుధవారం నిర్వహించిన విశ్వకర్మ జయంతోత్సవం, యజ్ఞం, పూజలో ఆయన పాల్గొని పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. లోక కళ్యాణార్ధం విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం, పూజలు చేయడం అభినందనీయమన్నారు. మానవాళి మనుగడకు మను, మయ, త్వష్ణ, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలైన విశ్వబ్రాహ్మణులు పంచదాయ వృత్తులను చేపట్టి ఎన్నో విశిష్ట సేవలను అందిస్తున్నారని తెలిపారు.
ప్రతి సంవత్సరం యజ్ఞ నిర్వహణతో సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి అందిస్తున్నట్టే అన్నారు. ఈ కార్యక్రమంలో యజ్ఞ కమిటీ అధ్యక్షుడు కూరెళ్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కాసోజు శంకరాచారి, గౌరవాధ్యక్షుడు కాసోజు విశ్వనాథం, కోశాధికారి రాగిఫణి విష్ణుమూర్తి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చక్రహరి రామరాజు, విశ్వబ్రాహ్మణ విద్యార్ధి వసతి గృహం అధ్యక్షుడు కూరెళ్ల రమణాచారి, విశ్రాంత ఐఏఎస్ చోల్గేట్ ప్రభాకర్, నాయకులు అభోజు మదనాచారి, పెరికేటి వెంకటాచారి, చోల్లేట్ రమేష్, లీగల్ అడ్వజర్ నామోజు లింగాచారి, విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు.