మునుగోడు, సెప్టెంబర్ 17 : దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు, వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర అన్ని రకాల చేయూత పెన్షన్లు రూ.4 వేలకు పెంచాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 23వ తేదీన నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో చేయూత పెన్షన్ దారుల మహాసభను నిర్వహిస్తున్నట్లు, ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ పాల్గొంటారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డా.గోవిందు నరేశ్ మాదిగ తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పెన్షన్ దారులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. మునుగోడులోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో మునుగోడు నియోజకవర్గ ఎంఆర్పీఎస్, వీహెచ్పీఎస్ కార్యకర్తల సమావేశం మేడి శంకర్ మాదిగ అధ్యక్షతన బుధవారం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవిందు నరేశ్ మాదిగ మాట్లాడుతూ.. ఏపీలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచి ఇస్తున్నట్లు తెలిపారు. కానీ తెలంగాణలో రూ.6 వేలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులను మోసం చేస్తున్నట్లు చెప్పారు. ఇది ఘోరమైన మోసం అన్నారు. ఈ మోసం గురించి ప్రతిపక్షాలు కూడా మాట్లాడకుండా చేయూత పెన్షన్ దారులకు అన్యాయం చేస్తున్నాయన్నారు. కాబట్టే 50 లక్షల మంది పెన్షన్ దారుల పక్షాన మందకృష్ణ మాదిగ పోరాటానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం మాదిగ పాల్గొన్నారు.