Chhota Rajan : గ్యాంగ్‌స్టర్ () చోటారాజన్ (Chhota Rajan) కు 2001 నాటి వ్యాపారి జయశెట్టి హత్య కేసులో ముంబై హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం రద్దుచేసింది. హోటల్ వ్యాపారి అయిన జయాశెట్టి హత్యకు సంబంధించిన కేసులో గత ఏడాది మే నెలలో ప్రత్యేక కోర్టు చోటారాజన్‌ను దోషిగా నిర్ధారించింది. ఆపై జీవితఖైదు విధించింది. ఈ తీర్పును చోటారాజన్ ముంబై హైకోర్టులో సవాల్ చేశారు. 2024 అక్టోబర్ 23న ముంబై హైకోర్టు చోటారాజన్‌కు విధించిన శిక్షను సస్పెండ్ చేస్తూ బెయిలు మంజూరు చేసింది.
అయితే ఆ నిర్ణయాన్ని సీబీఐ.. సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన డివిజన్ బెంచ్ దీనిపై విచారణ జరిపింది. ‘చోటారాజన్ నాలుగు కేసుల్లో దోషిగా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తికి విధించిన జైలుశిక్షను ఏ విధంగా రద్దుచేస్తారు..?’ అని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వును రద్దుచేసింది. చోటారాజన్‌పై ఉన్న 71 కేసుల్లో 47 కేసుల్లో సీబీఐ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవని రాజన్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఆయన వాదనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఇతర కేసుల్లో ఇప్పటికే జీవితఖైదు పడినందున తిరిగి అతను లొంగిపోవాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం.. దక్షిణ ముంబైలోని గోల్డెన్ క్రౌన్ హోటల్ యజమాని జయాశెట్టికి చోటారాజన్ ముఠా నుంచి బలవంతపు వసూళ్ల బెదిరింపులు వచ్చాయి. శెట్టికి పోలీసు రక్షణ కల్పించినప్పటికీ అతని హత్యకు రెండు నెలల ముందు భద్రతను ఉపసంహరించారు. రూ.50 వేలు ఇవ్వాలన్న చోటారాజన్ గ్యాంగ్ డిమాండ్‌ను కాదన్నందుకు 2001 మే 4న జయాశెట్టిని అతని కార్యాలయం వెలుపల ఇద్దరు ముఠా సభ్యులు కాల్చిచంపారు. ఈ కేసుకు విచారణ అనంతరం 2024 మే నెలలో ముంబైలోని ప్రత్యేక ఎంసీఓసీఏ కోర్టు చోటారాజన్‌కు జీవితఖైదు, రూ.1,00,000 జరిమానా విధించింది.