పెన్‌పహాడ్, సెప్టెంబర్ 17 : ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ అన్నారు. రోటరీ క్లబ్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో బుధవారం పెన్‌పహాడ్ మండలం మాచారం గ్రామ ఆవాసం అనిరెడ్డిగూడెంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పురాతన రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం అను నానుడి సత్యమైనదని, దాని వైపు అందరూ పయనించాలని, పౌష్టికమైన ఆహారాన్ని భుజిస్తూ తగిన వ్యాయామం చేస్తూ దినచర్యలో ఆరోగ్యంపై కనీస జాగ్రత్త, అవగాహన ఉంచుకోవాలన్నారు.
ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన 100 మందికి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపి నిర్ధారణ అయిన వారికి ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ చైర్మన్ జులకంటి యోగేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మీనాక్షి, జూలకంటి జగన్ మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జోగి రెడ్డి, దుర్గా రెడ్డి, యోగేశ్వరెడ్డి పాల్గొన్నారు.