హైదరాబాద్, మార్చి4 (నమస్తే తెలంగాణ): ‘ఇంట్లో ఎలుకలు ఉన్నాయని వెనుకటి ఒకడు ఏకంగా తన ఇంటినే తగులబెట్టిండంట’.. తాజాగా తెలంగాణ విద్యాకమిషన్ సిఫార్సులు కూడా సరిగ్గా అదే సామెతను తలపిస్తున్నాయి. నిర్దేశిత సంఖ్య కంటే అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయనే సాకుతో ఏకంగా రాష్ట్రంలోని డిగ్రీ గురుకుల కళాశాలలను రద్దు చేయాలని ఆ కమిషన్ సిఫార్సు చేయడం తీవ్ర దుమారం రేపుతున్నది. కమిషన్ నివేదికను వివిధ కుల సంఘాలు, విద్యావేత్తలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది మహిళల ఉన్నత విద్యాభ్యాసానికి తీరని విఘాతమని హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీల స్థాయిలో కనీస అవగాహన లేని అధికారుల వల్లే డిగ్రీ గురుకుల కాలేజీలు నిర్వీర్యమవుతున్నాయని వివరిస్తున్నారు. గురుకులాల ఏర్పాటు అసలు లక్ష్యాన్ని, బడుగులకు ఉన్నత విద్యను దూరం చేయడమేనని వెల్లడిస్తున్నారు. అడ్మిషన్ల సంఖ్య పెరుగకపోవడానికి అసలు కారణం సొసైటీలు, ప్రభుత్వ నిర్ణయాలే కారణమని, ఆ లోపాలను విస్మరించి ఏకంగా కాలేజీలనే రద్దు చేయాలని సిఫార్సు చేయడంపై ఆవర్గాల మండిపాటుకు కారణమైంది.
దేశంలో మహిళా విద్యాభివృద్ధికి మహాత్మా జ్యోతిబాఫూలే ఎనలేని కృషి చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఆయన చూపిన తోవలోనే కేసీఆర్ నేతృత్వంలోని గత తెలంగాణ సర్కార్ ముందుకు సాగింది. రాష్ట్రంలో మహిళా విద్యాభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇచ్చింది. చారిత్రకంగా, సామాజికంగా నెలకొన్న పరిస్థితులను అంచనా వేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని మహిళలను ఉన్నత విద్యవైపు మళ్లించేందుకు ప్రణాళికలను రూపొందించింది. ఆయా వర్గాల బాలికల కోసం ప్రత్యేకంగా తొలుత గురుకుల పాఠశాలలు, ఆపై ఇంటర్, డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలను నెలకొల్పింది. పీజీ కాలేజీలను సైతం ఏర్పాటుచేసింది. పౌష్టికాహారం అందిస్తూ కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్యను అందించింది. ఆ కాలేజీల్లో విభిన్నమైన, మహిళల అభిరుచికి, ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకొనేందుకు దోహదపడేలా కోర్సులను ప్రవేశపెట్టింది.
సాధారణ డిగ్రీ కోర్సులతోపాటు ప్రత్యేక వృత్తివిద్య గురుకులాలనూ నెలకొల్పింది. రుక్మాపూర్‌లో సైనిక్ స్కూల్, భువనగిరిలో ఆర్మ్డ్ ఫోర్స్ కాలేజీ, వికారాబాద్‌లో ఫైన్ ఆర్ట్స్ కాలేజీ, సంగారెడ్డి కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు, హనుమకొండ, కందుకూరులో రెసిడెన్షియల్ లా కాలేజీలు, కరీంనగర్, వనపర్తిలో అగ్రికల్చర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటుచేసింది. డిగ్రీ గురుకులాల ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల విద్యార్థినులు ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో విద్యనభ్యసిస్తున్న బాలికలు 67.04% ఉండటమే నిదర్శనం. గురుకుల డిగ్రీ కాలేజీల ఏర్పాటుతో ఉన్నత విద్యా ప్రవేశాల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. పీజీ కోర్సుల్లో 72 శాతం, డిగ్రీలో 52 శాతం, బీఈడీ కోర్సుల్లో 81 శాతం యువతులే చేరుతుండటం గమనార్హం.
గురుకుల డిగ్రీ కాలేజీల్లో సీట్లు నిండకపోవడానికి ప్రధాన కారణం అడ్మిషన్ విధానంలోనే లోపం ఉన్నదని విద్యావేత్తలు వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్లను దోస్త్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దాని నుంచి సొసైటీల పరిధిలోని గురుకులాలను మినహాయించారు. సొసైటీలు సైతం నేరుగా అడ్మిషన్లు కల్పించకుండా ప్రత్యేకంగా ఎంట్రెన్స్ పరీక్షను మరోసారి నిర్వహిస్తున్నారు. మెరిట్ సాధించిన విద్యార్థులకే గురుకుల డిగ్రీ కాలేజీల్లో సీట్లను కేటాయిస్తూ వస్తున్నాయి. అదీగాక సాధారణ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ మొత్తంగా పూర్తయ్యాక అప్పటికే విద్యార్థులు అందుబాటులోని కాలేజీల్లో చేరిపోతున్నారు. ఈ అడ్మిషన్ విధానం వల్లే గురుకుల డిగ్రీ కాలేజీల్లో సీట్లు భర్తీ కావడం లేదని విద్యావేత్తలు వివరిస్తున్నారు. దోస్త్ ద్వారా, లేదంటే నేరుగా అడ్మిషన్లను కల్పించాలని సూచిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ 2026-27 విద్యాసంవత్సరం నుంచి నేరుగా అడ్మిషన్లు కల్పించాలని ఎస్సీ, బీసీ గురుకుల సొసైటీల ఇప్పటికే నిర్ణయించాయి. ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీచేశారు. సీట్లు నిండకపోవడానికి మరో ప్రధానకారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన నిర్ణయించిన టైంటేబుల్ షెడ్యూలే ప్రధాన కారణమని తెలుస్తున్నది. పాఠశాల విద్యార్థులకు నిర్ణయించిన టైంషెడ్యూల్నే డిగ్రీ కాలేజీలకు విధించడం గమనార్హం. కామన్ గ్రూపుల విద్యార్థులందరినీ విలీనం చేసి ఒకేచోట 100 మందిని కూర్చోబెట్టి తరగతులను నిర్వహిస్తుండటం, మరో సబ్జెక్ట్ కోసం ఇటు విద్యార్థులు, అటు అధ్యాపకులు ఒక్కో తరగతి గది మారుతూ ఉండటం ఇబ్బందికరంగా మారింది.
ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల టైంటేబుల్ ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతుంది. 8.45 గంటల వరకు రెగ్యులర్ సిలబస్‌కు సంబంధించి ప్రిపరేటరీ టెస్ట్ నిర్వహిస్తారు. 8.45 నుంచి 9గంటల వరకు మార్నింగ్ అసెంబ్లీ ఉంటుంది. ఆ తర్వాత 9 గంటల నుంచి ప్రతి 45 నిమిషాలకూ ఒకటి చొప్పున మధ్యాహ్నం ఒంటిగంట వరకు తరగతులు కొనసాగుతాయి. ఏకబిగిన 5గంటల పాటు తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యలో 10.30 గంటల నుంచి 10.32 గంటల వరకు అంటే కేవలం 2 నిమిషాలే వాటర్/వాష్‌రూమ్ బ్రేక్ ఇస్తుంటారు. పాఠశాల తరహాలోని కాలేజీ టైమ్‌టేబుల్‌ను చూసి విద్యార్థినులు బెంబేలెత్తుతున్నారు. గురుకులాల్లో ఉండేందుకు విముఖత చూపుతున్నారు. అడ్మిషన్ తీసుకున్నా మధ్యలోనే ఇంటిబాట పడుతున్నారు.
తెలంగాణ సామాజిక పరిస్థితులను ఆకళింపు చేసుకొని డిగ్రీ గురుకులాలను నాడు కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేయగా, నేటి రేవంత్ సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా వాటి మూసివేతకే కంకణం కట్టుకొన్నది. గడచిన రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగానే నిర్ణయాలు తీసుకొంటున్నది. అధికారం చేపట్టిన వెంటనే నిరుడు ఎస్సీ గురుకుల సొసైటీలో 12కు పైగా ఇంటర్ కాలేజీలను మూసివేసింది. అనేక గ్రూపులను కుదించింది. ప్రత్యేక గురుకులాలు, ఒకేషనల్ గురుకులాలను రద్దుచేసింది. తా జాగా గురుకుల డిగ్రీ కాలేజీల మూసివేతకు సైతం రంగం సిద్ధం చేసినట్టు సిఫార్సులు అందయి. ఇప్పటికే పలు డిగ్రీ గురుకుల కాలేజీలను విలీనం చేసింది. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో బీబీనగర్‌లోని రెసిడెన్షియల్ ఆర్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ను ఉన్నఫలంగా అవుషాపూర్ క్యాంపస్‌కు తరలించింది. ఇప్పుడు ఏకంగా దానిని మూసి వేసే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తున్నది. మొత్తంగా గురుకుల డిగ్రీకాలేజీల మూసివేతకు కాంగ్రెస్ సర్కార్ యత్నిస్తున్నదని స్పష్టంగా తెలిసిపోతున్నది. తాజా గా విశ్రాంత ఐఏఎస్ ఆకునూరి మురళి నేతృత్వం లోని విద్యాకమిషన్ సైతం గురుకుల డిగ్రీ కాలేజీలు మూసివేయాలనే సిఫార్సు చేయడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. క్షేత్రస్థాయి లోపాలను సవరించే సిఫార్సులు చేయకుండా, ఏకంగా గురుకులాలనే మూసివేయాలని సూచించడం, యూజీ కోర్సులకు రెసిడెన్షియల్ విధానం పనికారాదని, సీట్లు నిండటం లేదని సాకులు చూపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నివేదికపై విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తీవ్రంగా తప్పుబడుతున్నాయి.
డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాళ్లుగా నియమించాలంటనే యూజీసీ గైడ్‌లైన్స్ ప్రకారం 15 ఏండ్ల టీచింగ్ అనుభవం, పీహెచ్డీ, రిసెర్చ్ పత్రాలు తదితర అకడమిక్ ఫర్మార్మెన్స్ ఇండెక్స్ (ఏపీఐ) పరిశీలించాల్సి ఉంటుంది. యూజీసీ గైడ్‌లైన్స్‌నే పాటించాలని అన్ని సొసైటీలకు తెలంగాణ ప్రభుత్వం 2019లో జీవో 15ను విడుదల చేసింది. కానీ ఎలాంటి అనుభవం లేని వారికి ఏకంగా డిగ్రీ కాలేజీల ఇన్చార్జి బాధ్యతలను ఎస్సీ గురుకుల సొసైటీ అప్పగించడం గమనార్హం. సొసైటీ నిబంధనల మేరకు ప్రిన్సిపాల్‌గా మూడేండ్ల అనుభవం ఉన్న వారికే జాయింట్ సెక్రటరీగా నియమించాల్సి ఉం టుంది. ఆ నిబంధనలకు సైతం పాతరేసి, సీనియర్లను పక్కనబెట్టి ప్రధాన కార్యాలయంలో సుదీర్ఘకాలం పాటు పాగావేసిన ఒకరిని జా యింట్ సెక్రటరీగా నియమించడం ఇక్కడ కొసమెరుపు. అనుభవరాహిత్యంతో సదరు ఉన్నతాధికారి ఇష్టారీతిన తీసుకుంటున్న నిర్ణయాలతో ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలు భ్రష్టు పట్టిపోతున్నాయని సొసైటీ ఉద్యోగ వర్గాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి ఆయా అంశాలను తీసుకెళ్లినా పట్టించుకోలేదు.
