ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రతిపాదిస్తున్న రాజకీయ ప్రత్యామ్నాయం, వర్తమానానికి పరిమితమైనట్లయితే ప్రస్తుత సమస్యలకు పరిష్కారంగా కనిపిస్తున్నది. కానీ, మధ్యయుగాల నుంచి భారతదేశ చరిత్రను, స్వాతంత్య్రానంతర పరిణామాలను, దేశ భవిష్యత్తును కూడా దీర్ఘకాలికంగా పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఆయన ఆలోచనల సమగ్ర స్వరూపం ఒక ‘నవభారత గీత’ రచన వలె తోస్తున్నది. ఇప్పుడిప్పుడే వెల్లడవుత్ను తన భావాలను అర్థం చేసుకొనే కొద్దీ ఈ మాటను గ్రహించటం కష్టం కాదు.
యథాతథంగా కేసీఆర్ వర్తమాన సమస్యల గురించి మాత్రమే గాక, స్వాతంత్య్రానంతరపు గత 75 ఏండ్ల వైఫల్యాలు, అవి సృష్టించిన శూన్యం గురించి పదేపదే మాట్లాడుతున్నారు. వర్తమానం గురించి మాత్రమే గాక, దేశ భవిష్యత్తును ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో, అభివృద్ధి కుంటినడక, వివిధ ప్రజావర్గాల వెనుకబాటుతనం, పెచ్చరిల్లుతున్న సామాజిక దురాచారాలు, రుగ్మతల గురించి మాట్లాడుతున్నారాయన.
ఒక దేశం ఇటువంటి స్థితిని ఎదుర్కోవటం ఆకస్మికంగా జరిగేది కాదు. అందుకు సుదీర్ఘమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యం ఉంటుంది. ఆ విధంగా 1947లో మొదలైన మన ఆధునిక చరిత్రకు, వందల ఏండ్ల మధ్యయుగ నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం లేనిదే మన స్వాతంత్య్రోద్యమానికి ఆ విధమైన ఆకాంక్షలు, స్వభావం ఏర్పడి ఉండేవి కావు. తర్వాత ఆ విధమైన రాజ్యాంగం, చట్టాలు, విధానాలు, ప్రణాళికలు రూపొందేవి కావు. ఆ కాలంలో ప్రజలు చాలా ఆశించారు. కానీ అతివేగంగానే అంతా కుంటుబడిపోయింది.
‘75 ఏండ్ల వైఫల్యాలు..’ అని కేసీఆర్ అనటంలో ఈ సుదీర్ఘత అంతా ఉంది. 1947కు ముందునాటి వందల ఏండ్ల రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులు, అశాంతులు, కల్లోలాల సుదీర్ఘ నేపథ్యం కూడా అందులో అవాచ్యంగానైనా అంతర్లీనమై ఉంది. మౌలికంగా ఇదీ కేసీఆర్ దార్శనికత. లేదా అందుకు భూమిక అనదగ్గది.
రెండవ అంశం- ఈ 75 ఏండ్ల వైఫల్యాలు. వైఫల్యం ఎవరిది? ఏ ఒక్కరిదో కాదు. ఆయన ఎవరినీ వేలెత్తి చూపలేదు కూడా. దాని అర్థం ఎవరైనా చెప్పగలరు. ఈ కాలమంతా అందరూ విఫలమయ్యారని, ఇంకా చెప్పాలంటే, తాము లాభపడి దేశాన్ని విఫలం చేశారని ప్రజలంతా భావిస్తున్నదే. అనేకానేక జాతీయ, అంతర్జాతీయ అధ్యయనాలు తేల్చిచెప్పిందే. ప్రపంచస్థాయి సూచీలు అనేకం ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నదే. కొందరి చేతిలో సంపదలు నానాటికీ పోగుపడటం, దేశ వనరులు కొందరికే చేజిక్కటం, బ్యాంకులను బహిరంగంగా కొల్లగొట్టడం, పాలకులు ఎవరైనా, ఏ పార్టీ అయినా విధానాలు వారికే అనుకూలంగా రూపొందటం, అమలుకావటం, అవినీతి వంటి సూచీలు ఈ 75 ఏండ్లుగా అంతే క్రమం తప్పకుండా రెండవ పక్షాన్ని పీడిస్తున్నవే.
1915లో దక్షిణాఫ్రికా నుంచి తిరిగివచ్చిన గాంధీ, అప్పటికే గల కాంగ్రెస్ మహామహులను గౌరవిస్తూనే ప్రత్యక్షంగా, నేరుగా ప్రజలవద్దకు వెళ్లటం ఈ సందర్భంగా గుర్తుకువస్తున్నది.దేశ రాజకీయాలను గుణాత్మకంగా మార్చాలన్నది కేసీఆర్ మనసులో గట్టిగా ఉన్నమాట.
కేసీఆర్ ఎవరి పేరెత్తకుండా వైఫల్యాల గురించి మాట్లాడటంతో పాటు, ఒక మాట పదేపదే అంటున్నారు.. ‘దేశ రాజకీయాల్లో శూన్యత ఏర్పడింద’ని. ఇందులో ఆయన ఉద్దేశం కేవలం కేంద్ర రాజకీయాలు అనుకోలేము. దేశం అంటే దేశమే. అది సర్వస్వం అవుతుంది. ఇక శూన్యత ఏమిటో, ఆ మాటకు అర్థం ఏమిటో అది ఎప్పటినుంచి ఎందుకు ఏర్పడుతూ వస్తున్నదో, ఎందువల్ల కొనసాగుతున్నదో పలు రూపాల్లో చర్చ జరుగుతున్నదే గనుక ఇక్కడ ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. అయినా క్లుప్తంగా చెప్పుకోవాలంటే.. నెహ్రూతో ఏర్పడిన తొలి దశ ప్రభుత్వ పాలనను కాంగ్రెస్‌లోని స్వార్థపరులే విఫలం చేశారు. తర్వాత ఏర్పడిన శాస్త్రి, ఇందిర ప్రభుత్వాలను అదే వర్గాలతో పాటు బ్యూరోక్రటిక్ శక్తులు, జాతీయ, అంతర్జాతీయ వ్యాపార వర్గాలు విఫలం చేశాయి. ప్రత్యామ్నాయ లెఫ్ట్-ఆఫ్-ద-సెంటర్ అని, కులాలూ ప్రాంతాల ప్రతినిధులం అంటూ వచ్చిన పార్టీలు ఏదో కొన్ని తళుకులను చూపటం తప్పితే, తాము స్వయంగా దారితప్పటం, అవే శక్తులబారిన పడటంతో విఫలమయ్యాయి. వారికి ఇతర పార్టీలకు పెద్దగా తేడా ఉన్నట్లు ప్రజలకు తోచలేదు. శూన్యమన్నది అందుకు ఆ విధంగా మొదలై కొనసాగింది. చివరికి, ‘తమ సిద్ధాంతమే ఒక ప్రత్యామ్నాయం’ అంటూ ముందుకువచ్చిన కమ్యూనిస్టులు అంతే దారుణంగా విఫలమయ్యారు.
ఈ శూన్యంలో ప్రజలు మిన్నకుండలేదు. ప్రత్యామ్నాయ శక్తి ఏమిటో వారికి స్పష్టత లేకపోవచ్చు. కానీ తమ అశాంతిలో 1960ల నుంచే రకరకాల ఉద్యమాలు ఎక్కడికక్కడ చేశారు. ప్రత్యామ్నాయం అవుతుందేమో అని ఆశ కలిగిన కొన్ని పార్టీలను, ఫ్రంటులను, నాయకులను అధికారానికి తెచ్చారు. అవి విఫల శక్తులని తెలియరావటంతో తోసివేశారు. తమ నిరాశతో, భ్రమలలో దారితప్పుతూ ప్రస్తుతం మరొకదానిని ఆశ్రయిస్తున్నారు.
విచారకరం ఏమంటే.. మహత్తర చరిత్ర, సంస్కృతి, గొప్ప ప్రజలు, అపారమైన వనరులు గల భారతదేశం, వందేండ్ల స్వాతంత్య్ర పోరాటం చేసి 75 ఏండ్లపాటు స్వతంత్రంగా ఉండి కూడా ఈరోజున శూన్యంలో తడుముకుంటున్నది. ప్రజాస్వామికత రీత్యా ఆదర్శవంతమై, అభివృద్ధిలో అగ్రగణ్యమై, సంస్కరణల ద్వారా సామాజిక రుగ్మతలను నిర్మూలించుకొని ఎంతో సంతోషంగా నివసించవలసిన దేశం ఇంత అధ్వాన్నస్థితిలో ఉన్నది.
ఈ విధంగా సర్వసమగ్రమైన రీతిన, స్వాతంత్య్ర పూర్వస్థితిని, ఆ మహోద్యమాన్ని, తదనంతర వైఫల్యాలను, భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుంటూ రచించబూనుకున్నదే కేసీఆర్ ‘నవభారత గీతం’. అందుకు ఆయన ప్రధానంగా ప్రజలను కదలించదలచడమన్నది ఒక అతి కీలకమైన, గమనార్హమైన ఆలోచన. 1915లో దక్షిణాఫ్రికా నుంచి తిరిగివచ్చిన గాంధీ, అప్పటికే గల కాంగ్రెస్ మహామహులను గౌరవిస్తూనే ప్రత్యక్షంగా, నేరుగా ప్రజలవద్దకు వెళ్లటం ఈ సందర్భంగా గుర్తుకువస్తున్నది. దేశ రాజకీయాలను గుణాత్మకంగా మార్చాలన్నది కేసీఆర్ మనసులో గట్టిగా ఉన్నమాట. ప్రజలు అది కోరుకుంటారు. కోరుకుంటున్నారన్నది నిర్వివాదం. ఇది నెరవేరితే దేశం, కొత్తమలుపు తిరుగుతుంది. ఇంత సమగ్ర, మౌలిక దృష్టితో ఇటువంటిది గతంలో ఎవరూ చేయని ఆలోచన.
టంకశాల అశోక్
98481 91767