ఆది నుంచి అంతం వరకు మానవ జీవితమంతా స్వచ్ఛంగా, సంస్కార ప్రవాహంగా సాగాలన్నది సనాతన ధర్మం ఉద్దేశం. నిరపేక్ష ఆత్మానంద ప్రాప్తితో, వాసనాక్షయంతో జన్మరాహిత్యం పొందాలన్నది భారతీయ రుషుల అవగాహన, ఆదర్శం, ఆశయం. అదే బహురూప యోగసాధనం. వివిధ కర్మల ఖండాల గొలుసుగా సాగుతుంది సాధారణ జీవితం. వాటిని ఒక దండగా అల్లి, సోపానంగా కట్టి ఆత్మానందమనే మోక్షప్రాప్తి వైపు నడిపించేదే ఆధ్యాత్మిక మార్గం. ఈ దిశలో సాగిన సాధనలు, వెలసిన మార్గాలు అనేకం. ఆ పరిణత మార్గాలలో ఒక విశిష్ట స్థానం కలిగింది వీరశైవ మార్గం. ఈ మార్గంలో ధార్మిక వికాసానికి ‘అష్టావరణాల’ను, సామాజిక వికాసానికి ‘పంచాచారాల’ను, ఆధ్యాత్మిక వికాసానికి ‘షట్ స్థలాల’ను నిర్మించి నిర్ణయించారు దేశిక స్వాములు.
ప్రతి మతం తమ మార్గస్థులను ఉద్ధరించడం కోసం కొన్ని చిహ్నాలను, వస్తువులను, వాఙ్మయాన్ని, గురు సంప్రదాయాన్ని, జీవన విధానాలను పవిత్రభావంతో ఆలంబనగా ఏర్పరుచుకుంటుంది. వీటిని తమ ప్రత్యేకత తెలిపేవిగా, నిలిపేవిగా నిర్మించుకుంటారు. అవి లాంఛనాలై, కవచాలై, ఆచ్ఛాదనలై, ఆవరణలై కాపాడేవిగా అంకితభావంతో రూపొందించుకుంటారు. తమ అనుభవ సంపదను పెంచుకునేవిధంగా నిష్ఠతో అనుష్ఠిస్తారు. అయితే ఆ నిష్ఠ గుడ్డిదైనప్పుడు ఇతర మార్గాల విశిష్టతలను కనలేక ద్వేషాలకు, వైరుధ్యాలకు, ఘర్షణలకు దారితీస్తుందన్నది మతాల చరిత్రలో కనబడే దాని వికృత పార్శ్వం. లింగాయతన మార్గానికి ‘అష్టావరణాలు’ పరమ ఆధారభూతమైనవి. అవి గురువు, లింగం, జంగం, విభూతి, రుద్రాక్ష, మంత్రం, పాదోదకం, ప్రసాదం అని ఎనిమిది. వీటిలో గురువు, లింగం, జంగం అన్నవి పూజనీయాలు. అంటే పూజలందుకునేవి. విభూతి, రుద్రాక్ష, మంత్రం పూజకు సాధనాలు. పాదోదకం, ప్రసాదం పూజకు పుణ్య ఫలాలు.
నిరాకారుడు, నిర్గుణుడైన శివ పరమాత్మను లింగం, గురువు, జంగంగా భక్తులకు ప్రత్యక్షపరుస్తుంది లింగాయతన సంప్రదాయం. భక్తుడు ధరించి పూజించేది గురువు దీక్షగా అందించిన భౌతికమైన ఇష్టలింగం. గురువు ఇష్టలింగాన్ని మించి ప్రాణలింగాన్ని అర్చిస్తాడు. భక్తుడికి ఇష్టలింగ దీక్షనిచ్చి శివానుభవానికి దారిచూపుతాడు. జంగముడు భావలింగాత్మకుడై శివానుభవం పొంది అటువైపు నడుపుతూ భక్తుని వెంట నడుస్తాడు. స్వరూప సాక్షాత్కారం చేసుకొని జనన, మరణ గమనాలను ‘శూన్యం’ చేసుకున్నవాడే జంగముడు. లింగాయతన మార్గంలో పరివ్రాజకుడైన జంగముడి స్థానం మహోన్నతమైనది.
విభూతి, రుద్రాక్ష, మంత్రం శివానుభవ ప్రాప్తివైపు భక్తుణ్ని తీసుకెళ్లే సాధనాలు. నిరంతరం కాలాగ్నిలో లోకాలు, జీవులు దహనమవుతుంటే భేదరహితంగా, సర్వసమానంగా మిగిలేదే బూడిద (బూది). దాని పవిత్రరూపమే విభూతి. జగత్తు అనిత్యతను నిత్యం గుర్తుచేస్తూ మన చిత్తాన్ని, ఎరుకను నిర్వికార స్వచ్ఛతలోకి ఎత్తి నిలిపేదే విభూతి ధారణ. రుద్రుడి కన్నీటి బిందువు రుద్రాక్ష. సహజ సిద్ధమైన రుద్రాక్ష ధారణ వల్ల అటు దైహిక, ఇటు మానసిక శక్తులు స్వచ్ఛతను, బలాన్ని పొందుతాయి. ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం సుగమం అవుతుంది.
ఇక మంత్రం శబ్ద తరంగాత్మక ఉపకరణం. శివ పంచాక్షరి మంత్ర జపం మనిషి జీవ, మానసిక స్పందనలను విశ్వ చైతన్యంలో విలయింపజేస్తుంది. ఉనికి నాణ్యతను ఉద్ధరించి శివ సాయుజ్యం వైపు నడిపిస్తుంది.
గురువును, జంగములను భక్తితో కొలుస్తూ, వారి పాదసేవ చేస్తూ, వారి పవిత్ర పాదోదకాన్నే తీర్థంగా గ్రహించడం జరుగుతుంది. మనం సంపాదించింది, సాధించింది వారికి సమర్పించి, వారిద్వారా ‘ప్రసాదం’గా స్వీకరించడం వీరశైవమార్గం విశిష్టత. ఈ విధంగా అష్టావరణాలతో తమ జీవితంలో ధార్మికతను సుసంపన్నం చేసుకుంటారు లింగాయతన మార్గీయులు. అలాగే పంచ ఆచారాలతో సమసమాజ భద్రతను, షట్ స్థల సోపానంపై శివత్వ ఉన్నతిని ఆవిష్కరించుకుంటారు.
యముగంటి ప్రభాకర్
94401 52258