‘ఏ రోజైతే భారతదేశంలో స్త్రీ అర్ధరాత్రి స్వేచ్ఛగా నడవగలిగిన పరిస్థితి ఉంటుందో ఆ రోజే భారతదేశానికి స్వేచ్ఛ లభించినట్టు’ అని మహాత్మాగాంధీ ఎప్పుడో చెప్పారు.మహిళల భద్రతకు సంబంధించి భవిష్యత్ తరం నాయకులకు గాంధీజీ ఈ విధంగా ఒక బలమైన ఎజెండాను ఏర్పాటు చేశారు. దీనిని తెలంగాణ అక్షరాలా పాటిస్తున్నది.
కొత్తగా రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం.. ప్రజల భద్రత కోసం ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక చర్యలు చేపట్టింది. కొత్త వాహనాల కొనుగోలు, మౌలిక సదుపాయాల పెంపుదల, సిబ్బంది శిక్షణతో పోలీసు విభాగాన్ని బలోపేతం చేసింది. మహిళల భద్రతకు సంబంధించి తెలంగాణ ప్రారంభించిన కార్యక్రమాలు దేశంలోని పలు రాష్ర్టాలకు మార్గదర్శకంగా నిలిచాయి.
రాష్ట్రం ఏర్పడిన 2014లోనే తెలంగాణ పోలీసు విభాగం షీ టీమ్స్‌ను ప్రారంభించింది. హైదరాబాద్ నగరంలో ఇవి మంచి ఫలితాలు ఇవ్వటంతో రాష్ట్రమంతటా వీటిని విస్తరించారు. షీటీమ్స్ ఎంతగా విజయవంతం అయ్యాయంటే.. ఈ తరహా సేవలను ప్రస్తుతం మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీ, ఒడిశా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ర్టాలలో వివిధ పేర్లతో పోలీసు విభాగాలు అందజేస్తున్నాయి.
బహిరంగ ప్రదేశాల్లో యువతులు, మహిళలపై వేధింపులను అరికట్టటంలో షీటీమ్స్ ఒక బలమైన సాధనంగా పని చేస్తున్నాయి. సైబర్ నేరాలను నిరోధించటంలోనూ ముందున్నాయి. వ్యక్తుల ఆలోచనల్లో, దృక్పథంలో మార్పు తీసుకురావటానికి షీటీమ్స్ చొరవ తీసుకొని వినూత్న కార్యక్రమాలను అమలుచేస్తున్నాయి. తొలిసారి నేరం చేస్తూ పట్టుబడిన వారికి ప్రొఫెషనల్ కౌన్సెలర్లతో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత నిర్దిష్టకాలం ఆ వ్యక్తులపై పర్యవేక్షణ ఉంటుంది. మళ్లీ నేరాలకు పాల్పడితే వారిపై నిర్భయ తదితర చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి. డయల్ 100, వాట్సాప్, హ్యాక్ఐ యాప్, ఫేస్బుక్, ఈమెయిల్, ట్విట్టర్, క్యూఆర్ కోడ్, షీటీమ్స్ వెబ్సైట్ రూపాల్లో షీటీమ్స్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్షేత్రస్థాయిలో దగ్గరయ్యే లక్ష్యంతో ‘షీటీమ్స్ సైబర్ కాంగ్రెస్ ప్రోగ్రామ్’ ప్రారంభమైంది. తెలంగాణ పోలీసు మహిళా భద్రత విభాగం, షీ టీమ్స్ కలిసి జిల్లాకు 50 పాఠశాలల చొప్పున అమలుచేస్తున్నాయి.
దీంట్లోభాగంగా ప్రతి పాఠశాల నుంచి ఒక టీచర్‌ను, ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణనిస్తారు. సైబర్ అంబాసిడర్లుగా శిక్షణ పొందిన విద్యార్థులు తమకు స్వయంగా లేదా ఇతర పిల్లలకు ఎదురయ్యే ఆన్లైన్ వేధింపులను ఎదుర్కోవటంలో చురుకైన పాత్ర పోషిస్తారు.
ఇది పాఠశాలలకు సంబంధించిన కార్యక్రమం కాగా.. కాలేజీలకు వెళ్లే యువతుల భద్రతకు సంబంధించి ‘సేఫ్టీ క్లబ్స్’ పేరుతో మరొక కార్యక్రమం అమలవుతున్నది. తెలంగాణలోని ప్రతీ కాలేజీకి చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఈ క్లబ్బుల్లో స్వచ్ఛందంగా పని చేయవచ్చు. మద్దతు అవసరమైన యువతకి.. పోలీసు, న్యాయ, ప్రజారోగ్యం, కౌన్సెలింగ్ వంటి వ్యవస్థాగత పరిష్కార యంత్రాంగానికి మధ్య సేఫ్టీక్లబ్స్ వారధిగా పనిచేస్తాయి. 2021లో ‘షీ-సైబర్ ల్యాబ్’ ఏర్పాటైంది. మహిళలు, పిల్లల మీద జరిగే నేరాలపై జరిగే దర్యాప్తునకు ఈ ల్యాబ్ సాంకేతిక సహాయం అందిస్తుంది. ఈ ల్యాబ్‌ను అత్యాధునిక సైబర్ ఫోరెన్సిక్, ఇన్వెస్టిగేటివ్ టూల్స్, టెక్నాలజీతో ఏర్పాటు చేయటం జరిగింది. ‘సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్’ జరిపిన సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 86 శాతం మంది షీ టీమ్స్ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
హాక్ ఐ-మొబైల్ అప్లికేషన్: ఆపదలో చిక్కుకొని ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నవారికి పోలీసులు ఎంత త్వరగా, సులభంగా అందుబాటులో ఉండగలిగితే అంతగా బాధితుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. సిటిజన్ ఫ్రెండ్లీ, రెస్పాన్సివ్ పోలీసింగ్‌లో భాగంగా తెలంగాణ పోలీసు విభాగం 2015లో ‘హాక్ ఐ’ యాప్‌ను ప్రారంభించింది. సమస్త పోలీసువిభాగం సేవలను ఈ ఒక్క యాప్ ద్వారా పొందవచ్చు. ఇప్పటికి ఐదు లక్షలమంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌లో మహిళల భద్రతకు సంబంధించిన కీలకమైన ఫీచర్లు ఉన్నాయి. అవి.. ‘ఎస్ఓఎస్ బటన్’, ‘విమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్’.
ఎస్ఓఎస్ బటన్: ఈ యాప్‌ను ఉపయోగించేవారు.. తాము ఆపదలో ఉన్నప్పుడు తమ గురించిన సమాచారం ఎవరికి చేరాలో అటువంటి ఐదుగురి వివరాలను ముందుగానే నిక్షిప్తం చేయాలి. ఆపదలో నిజంగానే చిక్కుకున్నప్పుడు యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్‌ను నొక్కితే చాలు.. ఆ ఐదుగురిని అప్రమత్తం చేస్తూ మెసేజీ వెళ్తుంది. అదే సమయంలో, ఆపదలో ఉన్న వ్యక్తి సెల్‌ఫోన్ రేఖాంశ, అక్షాంశ వివరాల ఆధారంగా ఆ పరిధిలోని పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్కు, ఏసీపీకి, డీసీపీకి, పెట్రోలింగ్ వాహనానికి, ప్రధాన కంట్రోల్ రూమ్‌కి ఆటోమెటిక్‌గా మెసేజీ వెళ్తుంది.
విమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్: మహిళలకు ప్రయాణాల్లో ఉపయోగపడే ఫీచర్ ఇది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నిర్దేశిత ప్రయాణమార్గంలో కాకుండా వేరే మార్గంలో వాహనం వెళ్తుంటే ఇది హెచ్చరిస్తుంది. కావాలనుకుంటే పోలీసులకు కూడా సమాచారం పంపించే ఏర్పాటు ఉంటుంది.
రాష్ట్రంలోని దాదాపు 800 పోలీసు స్టేషన్లను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అన్ని పోలీస్ స్టేషన్లలో 24 గంటలపాటు పని చేసే ప్రత్యేక రిసెప్షన్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. వీటిని శిక్షణ పొందిన మహిళా పోలీసు అధికారులు నిర్వహిస్తున్నారు. మరోవైపు, ‘జీరో ఎఫ్ఐఆర్’ సదుపాయాన్ని ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు వర్తింపజేసింది. అత్యవసర సమయంలో అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా బాధితులకు ఈ సదుపాయం అవకాశం కల్పిస్తుంది. ప్రాథమిక విచారణ అనంతరం నేరం జరిగిన ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కు ఎఫ్ఐఆర్ బదిలీ అవుతుంది.
మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలను సమన్వయపరచటానికి 2018లో తెలంగాణ పోలీసు విభాగం ఆధ్వర్యంలో ‘మహిళా భద్రతా విభాగాన్ని’ రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహిళా భద్రతకు సంబంధించి ఇది అత్యున్నత పోలీసు విభాగం.
డయల్ 100/112: అత్యవసర సందర్భాల్లో సేవలు అందించటానికి వీలుగా 24 గంటలపాటు అందుబాటులో ఉండే వ్యవస్థను తొలిసారిగా తీసుకొచ్చిన రాష్ర్టాల్లో తెలంగాణ కూడా ఉంది. డయల్ 100 లేదా 112 పేరుతో ఇది అమలులోకి వచ్చింది.
తెలంగాణలో శాంతిభద్రతల అంశంలో మహిళాభద్రతకు ఈ విధంగా అత్యధిక ప్రాధాన్యత కొనసాగుతున్నది. దీనివల్లే దేశంలోని అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ తన స్థానాన్ని ఎప్పటికప్పుడు నిలుపుకొంటున్నది. చైతన్యవంతులైన పౌరుల చొరవ, పూర్తి అంకితభావం కలిగిన పోలీసు విభాగం సమిష్టి కృషితో తెలంగాణలోని అన్ని జిల్లాలు, నగరాలు, పట్టణాల్లో మహాత్మాగాంధీ కలను నిజం చేయటానికి ఈ కృషి నిరంతరం కొనసాగుతుంది.
(వ్యాసకర్త: అడిషనల్ డీజీ)
భరోసా కేంద్రాలు
లైంగిక వేధింపుల బాధితులకు సహాయపడడానికి వీటిని 2016లో ఏర్పాటు చేయటం జరిగింది. శారీరకంగా, మానసికంగా, లైంగికంగా, ఆర్థికంగా తీవ్రమైన వేధింపులకు గురైన మహిళలు, పిల్లలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ కేంద్రాలు అండగా నిలబడుతున్నాయి. కొత్త జీవితం ప్రారంభించటానికి బాధితులకు చేయూతనిస్తున్నాయి. నిపుణ్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో (11 డిసెంబర్ 2018న) సుప్రీంకోర్టు తెలంగాణ భరోసా కేంద్రాలను ప్రశంసిస్తూ.. ఇటువంటి కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని సూచించింది.
స్వాతి లక్రా