‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్లుగా ఉద్యోగ ప్రకటనలు రాలేదని ఇన్నాళ్లుగా గొడవ చేసినవారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయగానే వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఉద్యోగాల ప్రకటన ఓ మోసం అని ఒకరంటే.. ఉద్యోగాల భర్తీ ప్రకటన ఎన్నికల స్టంట్ అని ఒకరంటున్నారు. ఇంకొకరేమో.. ముందస్తు ఎన్నికలకు పోవడంలో భాగం అంటూ ఉద్యోగార్థులను అయోమయంలోకి నెట్టివేస్తునారు.
ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడైనా రావచ్చనే ఒక గట్టి నమ్మకంతో ఏండ్ల తరబడి సన్నద్ధమవుతున్న యువతను కరోనా రెండేండ్లు వెనక్కినెట్టివేసింది. నిరాశల నుంచి ఇప్పుడిపుడే బయటికివస్తున్న యువతకు ముఖ్యమంత్రి చేసిన ఉద్యోగాల ప్రకటన ఎంతో ఊరటనిచ్చింది. ఉద్యోగాల ప్రకటన వచ్చిన మరుక్షణం నుంచే పుస్తకాల్లో మునిగిపోతున్నారు. ఇలాంటి ఆశావహ పరిస్థితిలో యువత ఉన్నపుడు వారిలో ధైర్యం నింపాల్సిందిపోయి కోర్టుల పేరుతోనో లేదా ఇదంతా ఎన్నికల స్టంట్ అంటూ చెత్త ప్రకటనలు చేయడం ప్రతిపక్షాలకు సబబు కాదు.
ప్రతి ఉద్యోగార్థి తప్పనిసరిగా ఈ ఉద్యోగం నాదే అనే లక్ష్యంతో చదవడం మొదలుపెట్టారు. ఈ సమయంలో రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం అభ్యర్థులను నిరాశకు గురిచేసే ప్రకటనలు చేయవద్దు. అభ్యర్థులకు అటెండర్ నుంచి ఆర్డీవో స్థాయి ఉద్యోగం కూడా స్థానికులకే దక్కుతుందనే నమ్మకం ఏర్పడింది. జోన్లు, మల్టీజోన్లు తదితర విషయాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు ఉండటం మొదలైనవన్నీ రాష్ట్రంలో వచ్చిన అద్భుతమైన అవకాశం. దీంతోపాటు పరిపాలనా వ్యవస్థలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లయింది. మన ఉద్యోగాలు మనకే దక్కడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి, పట్టుదలను విద్యార్థి లోకం గుర్తుంచుకోవాలి. పోటీ పరీక్షల్లో విజేతలవ్వాలి. ఈ సమయంలో రిజర్వేషన్ రోస్టర్, లోకల్, జోనల్, మల్టీజోనల్, నాన్లోకల్తో పాటుగా ప్రశ్న పేపర్ లీకైంది, సిలబస్లో లేని ప్రశ్నలడిగారని, పరీక్ష కేంద్రం సరిగాలేదని, ప్రశ్నలు గజి బిజిగా ఇచ్చారని సాకులు చెప్తూ కోర్టులకు వెళ్లడం మానుకోవాలి.
ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలన్నీ భర్తీ అయ్యేదాకా ప్రభుత్వమే ఒక త్రిసభ్య లేదా ఐదుగురు సభ్యులతో కూడిన ఒక ఉన్నతస్థాయి కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే ఈ కొర్రీలకు తెరపడుతుంది. సుప్రీంకోర్టు లేదా హై కోర్టు రిటైర్డ్ జడ్జితో పాటుగా సుదీర్ఘ పాలన అనుభవం ఉన్న రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ఛాన్స్లర్, ఇతర రాష్ర్టానికి చెందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తదితర సభ్యులతో కూడిన ఒక ధర్మాసనం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది.
నోటిఫికేషన్ మొదలు నియామక పత్రం వరకు ఉద్యోగార్థులు తమ సమస్యలన్నీ ప్రత్యేక కమిటీకి మాత్రమే విన్నవించేలా ఉండాలి. వారు ఇచ్చిన తీర్పులనే ప్రభుత్వం ఆచరించేవిధంగా ఉండాలి. దీంతో ఎవరు పడితే వాళ్లు కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. కోర్టుకు వెళ్లిన కారణంగా 2011 నాటి గ్రూప్-1 పరీక్షా ఫలితాలు ఆరేడేండ్ల తర్వా త వచ్చాయి. ఈ విషయాన్ని రాజకీయపార్టీలు గుర్తుం చుకోవాలి. ఈ ఉద్యోగాల ప్రక్రియ తొందరగా ముగిస్తే రాష్ట్రంలోని వేల కుటుంబాల్లో దీపావళి వెలుగులు ముందుగానే వస్తాయి.