నువ్వు జేసిన దీక్షనే తెలంగాణను
ప్రపంచ పటంల కూసోవెట్టింది..
నాడు నువ్వు మెతుకు ముట్టకుంటనే
నేడు రైతన్నల పొలాలు పచ్చవడుతున్నయి.!
నాడు నీళ్ల సుక్క నీ గొంతుల పోయకుంటనే
నేడు భగీరథ నీళ్ళు మా గల్మళ్లకొస్తున్నయ్..
నాడు కంటి మీద రెప్పెయ్యకుంటనే
నేడు తెలంగాణ తంగేడు వనమై ఇరుగ పూస్తున్నది..!
నాడు నీ డొక్కెండుకపొయి, బొక్కలు తేలితేనే
మూలకున్న తెలంగాణ వనరుల
ముల్లెలు నేడు బయటవడ్తున్నయ్.!
నువ్వుజేసిన ఉద్యమ జిద్దు
దేశాన్ని గజ్జుమనిపించింది..
నీకు పానం మీద తీపిలేదు గనుకే…
తెలంగాణే నీ పంచప్రాణాలైనయి…
నాడు నువ్వు మంకుపట్టు వడితేనే..
నేడు బతుకమ్మ సప్పట్లు గొడ్తున్నది..
బోనం కుండ తియ్యగుంటున్నది…
తెలంగాణ భాష గల్లి గల్లీల
జబ్బలెగరేసుకుంట మాట్లాడుతున్నది..
గొంగడి కిందున్న యాదాద్రి
కొండపై వెలసింది..!
నాడు కన్నారం నుంచి ఖమ్మం దాన్క
గోస గోసోలె జూసిన మా కండ్లు…
కాళేశ్వరం నీళ్లను జూసి తెగ సంబురవడుతున్నయి..
నాటి మీ తెగింపును యాజ్జేసుకుంటున్నయి… అందుకే..!
నువ్వు కడుపు మాడ్సుకున్న రోజులను మేం మర్వలేదు సారు..
మా కుత్కెల పాణమున్నంత వరకు మర్శిపోం సారు..!
అస్సల్కే మర్శిపోం సారు…!
-తుమ్మల కల్పనారెడ్డి , 96404 62142