ఒకనాటి దిక్కులేని తెలంగాణ నేడు దేశానికే దిక్సూచిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా ఉద్యమించాలని వివిధ రాష్ర్టాలకు చెందిన 30కిపైగా రైతుసంఘాలు నిర్ణయించటం అసాధారణ విషయం. ఇది మన రాష్ర్టానికి లభించిన నికార్సైన ప్రశంస. సాధారణంగా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను రాష్ర్టాలు అనుసరిస్తుంటాయి. కానీ, ఈ ట్రెండ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ మార్చేసింది. దేశంలో అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం వేరే పేర్లతో అమలుచేస్తున్నది. మన రైతుబీమానే ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పేరుతో మోదీ సర్కార్ తీసుకొచ్చింది. రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే వినూత్నమైన ఆలోచనతో పురుడు పోసుకున్న రైతుబంధు.. కేంద్రానికే కాదు, దేశంలోని పలు రాష్ర్టాలకు అనుసరణీయంగా మారింది.
ఒకనాటి కరువు కాటకాల తెలంగాణ నేడు పచ్చదనాల తెలంగాణగా మారిందంటే రాత్రికి రాత్రి జరిగింది కాదు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు, అసామాన్య సంకల్పంతో చేపట్టి రికార్డు వ్యవధిలో పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులు, కరోనా వచ్చినా కాలం మారినా ఆగని రైతుబంధు తదితర పథకాలు- ఈ విధమైన సమగ్ర, వ్యూహాత్మక కార్యాచరణతో తెలంగాణలో వ్యవసాయ విప్లవం సంభవించింది. కేవలం ఆరేడేండ్ల వ్యవధిలో జరిగిన ఈ మహత్తర మార్పును ఎంఎస్ స్వామినాథన్ వంటి దిగ్గజ వ్యవసాయ శాస్త్రవేత్తలతోపాటు ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థలు వేనోళ్ల శ్లాఘించాయి. రాష్ట్ర ప్రగతి రథం ఇక్కడితోనే ఆగిపోలేదు. కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గురుకులాలు, దళితబంధు, ఆసరా పింఛన్లు, కులవృత్తులకు ప్రోత్సా హం, సర్కారు పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం, పల్లెప్రగతి, హరితహారం.. ఇవన్నీ తెలంగాణ రూపురేఖల్ని మార్చివేశాయి.
తెలంగాణ తరహా పథకాలను అమలు చేయాలంటూ తమిళనాడు, కర్ణాటక సీఎంలకు రైతుసంఘాలు పిటిషన్లు సమర్పించాయంటే, అన్ని రాష్ర్టాల్లోనూ ఇదే పని చేయాలని నిర్ణయించాయంటే, 50 లక్షల మంది రైతులతో ఉద్యమ కార్యాచరణ ప్రారంభించటానికి ఏకంగా ఒక మొబైల్యాప్నే ఏర్పాటు చేయాలని తీర్మానించాయంటే.. దేశవ్యాప్తంగా రైతాంగంపై తెలంగాణ చూపుతున్న ప్రభావం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ స్ఫూర్తిని యావత్ రైతులోకం అందిపుచ్చుకోవాలి. వ్యవసాయాన్ని పండుగలా, ఉత్సవంలా జరిపే రోజులను తమ తమ రాష్ర్టాల్లో ఆవిష్కరించుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చినట్లుగా జాతీయ ధాన్యం సేకరణ విధానాన్ని, అన్నదాతలకు రాజ్యాంగపరమైన రక్షణలను సాధించుకునే దిశగానూ ముందుకు కదలాలి.