AIADMK : తమిళగ వెట్రి ఖజగం పార్టీ ఎన్నికలకు ముందే రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారుతోంది. పార్టీ సభకు జనం భారీగా తరలివచ్చారని సంతోషించే లోపే.. విషాదం నెలకొంటోంది. నిరుడు సెప్టెంబర్‌లో కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా.. శుక్రవారం సేలంలో టీవీకే నిర్వహించిన సభలోనూ విషాదం నెలకొంది. విజయ్ను చూసేందుకు వచ్చిన ఒక వ్యక్తి ఎండ వేడిని తట్టుకోలేక ప్రాణాలు విడిచాడు. దాంతో, ఏఐఏడీఎంకే (AIADMK) నేత ఒకరు టీవీకే అధినేతను విమర్విస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. భవిష్యత్‌లో విజయ్ సభకు శవ పేటికతో వెళ్లాల్సి వస్తుందేమోనని ఆయన పేర్కొన్నారు.
అంసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా శుక్రవారం సేలంలో టీవీకే భారీ సభ నిర్వహిచింది. దురదృష్టవశాత్తూ.. ఈ సభకు వచ్చిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో ప్రత్యర్ధులు విజయ్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వ్యక్తి మృతి ఘటనపై ఏఐఏడీఎంకే మీడియా ప్రతినిధి కోవై సత్యన్ ఎక్స్ పోస్ట్‌లో విజయ్‌పై సెటైర్లు వేశారు. పాల్బేరర్స్, ఘనా గ్రూప్ శవపేటికతో డాన్స్ చేస్తున్న ఫొటో పెట్టిన ఆయన.. ‘పరిస్థితి చూస్తుంటే..భవిష్యత్‌లో టీవీకే విజయ్ సభకు వెళ్లేవారు తమ వెంట శవపేటికను తీసుకెళ్లాల్సి వస్తుందేమో’నని క్యాప్షన్ రాసుకొచ్చాడు.
தவெக கூட்டத்திற்கு போனா இனிமேல் கையோடு சவப் பெட்டியையும் கொண்டு போக வேண்டும் என்பது உறுதி.
Looks like to attend TVK rally in future one should carry his/her coffin. #TVK_rallymurder pic.twitter.com/kPyO7u5j1E
— Kovai Sathyan (@KovaiSathyan) February 13, 2026
‘సేలంలో టీవీకే సభకు హాజరయ్యేందుకు సూరజ్ అనే వ్యక్తి వచ్చాడు. అయితే.. ఎండ వేడిమి కారణంగా అతడు స్పృహ తప్పి కిందపడిపోయాడు. అతడలా పడిపోవడం చూసి.. వెంటనే ప్రథమ చికిత్స అందించి.. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించాం. అయితే.. గుండె పోటు కారణంగా ఆ వ్యక్తి మరణించాడని వైద్యులు తెలిపారు. సూరజ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. అతడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న’ అని టీవీకే నాయకుడు నిర్మల్ కుమార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. సభా స్థలిలోకి 5 వేల మందికే అనుమతి ఉన్నా.. 7,000 మందిని పంపించామని చెప్పారు. వీరిలో అనారోగ్యంతో బాధ పడుతున్నవారూ ఉన్నారు. ఆ వ్యక్తి మృతికి కారణం తెలిశాక నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.