ప్రధాని మోదీ ఇటీవల పార్లమెంట్లో మాట్లాడుతూ ‘పార్లమెంట్ దర్వాజలు మూసి తెలంగాణ బిల్లు అమోదించుకున్నార’ని అసంబద్ధమైన వాదన తెరపైకి తెచ్చారు. ్ల ప్రధానికి తెలంగాణపై మదిలో ఎక్కడో వ్యతిరేక భావం ఉన్నదనే సందేహాలు కనిపిస్తున్నాయి. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం పెండింగ్లోనే ఉంచుతున్నది ఇందుకేనా.?
ఆరు నెలలన్నారు.. ఎనిమిదేండ్లవుతున్నది: పునర్విభజన బిల్లులో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ వంటి హామీలిచ్చి ఎనిమిదేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ అమలు చేయలేదు. తాజాగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కాకుండా ఓవర్హాలింగ్ యూనిట్ పెడతామని కేంద్ర రైల్వేమంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకటించారు. మరోవైపు హార్టికల్చర్, గిరిజన వర్సిటీల ఏర్పాటుపై కేంద్రం ఇంకా నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నది. విద్యుదుత్పత్తి 4 వేల మెగావాట్లకు కేంద్రం నిధులు కేటాయించాలని విభజన హామీల్లో ఉన్నప్పటికీ పూర్తికాలేదు. 9వ షెడ్యూల్లోని సంస్థల విభజన ఇంకా అసంపూర్ణంగా ఉన్నది. దీంతో రెండు రాష్ర్టాలు కేసులు వేసుకున్నాయి. కేంద్రం చోద్యం చూస్తూ కూర్చున్నది. మొత్తంగా తెలంగాణకే అన్యాయం జరుగుతున్నది.
ప్రాజెక్టుల స్వాధీనం: తెలంగాణలోని ఓ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామన్న హామీ కూడా నెరవేరలేదు.
తెలంగాణ హద్దుల విషయంలో అన్యాయం చేసిన కేంద్రం నదుల విషయంలో ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తుందోనన్న చర్చ మొదలైందిప్పుడు. ప్రధానంగా కృష్ణా, గోదావరి, చిన్న నదులు అనేకం ఉన్నాయి. బచావత్ ట్రిబ్యునల్, ఆ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులపై చర్చించి పరిష్కారం చేయడానికేం ఇబ్బంది? ఇప్పుడు కృష్ణా జలాల కోసం రెండు రాష్ర్టాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకోగా, గోదావరి జలాల వివాదం మొదలైంది. దానికెవరు కారకులు? కేంద్రం ఎందుకు ప్రేక్షకపాత్ర వహిస్తున్నది. రెండు రాష్ర్టాల మధ్య జలజగడాలు తలెత్తితే, లేని హక్కును ఆపాదించుకొని, కృష్ణా-గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులపై పెత్తనాన్ని తీసుకుంటూ గతేడాది జూలైలో గెజిట్ నోటిఫికేషన్ను కేంద్రం జారీ చేసింది. ప్రాజెక్టులపై హక్కులు కేంద్రం తమ గుప్పెట్లో పెట్టుకొని పెత్తనం చేయటం, ఫెడరల్ వ్యవస్థకు భిన్నం కాదా?
రాష్ట్ర బీజేపీ నేతలేం చెప్తారు?: కేంద్రమంత్రి కిషన్రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాదని ప్రకటించటం మరీ విడ్డూరం. ప్రైవేట్ కంపెనీలకు అక్కడ నాణ్యమైన ఉక్కు కనిపించినప్పుడు, కేంద్రానికి ఎందుకు కనిపించడం లేదు? అలాగే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం ఎనిమిదేండ్లలో ఏర్పాటుచేయలేకపోగా, హైదరాబాద్ సమీపంలో ఇటీవలనే ఒక ప్రైవేటు సంస్థకు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఎలా సాధ్యమైం ది. దీనికి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రి ఏం సమాధానం చెప్తారు? రాష్ర్టాలు విడిపోయి ఎనిమిదేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో విభజన హామీల సమీక్షకు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు? ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపై రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానాలపై కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు. కాబట్టి కలిసివచ్చే రాజకీయ పార్టీలతో కలిసి ఢిల్లీ గద్దెకు సెగ తగిలేటట్లు ఉద్యమ కార్యాచరణను టీఆర్ఎస్ పార్టీ చేపట్టాలి.
–చాడ వెంకటరెడ్డి (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి)