ప్రతి దేశమూ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంది. ఏదో ఒక మేర అభివృద్ధిని సాధిస్తుంది. ప్రజలకు నాయకత్వం వహించే ప్రభుత్వాలు తమ లక్ష్యం అభివృద్ధేనని ప్రకటిస్తాయి. వ్యక్తులుగా కూడా ప్రతి ఒక్కరూ తమ అభివృద్ధిని బేరీజు వేసుకుంటూ తమ జీవితాలనుసమీక్షించుకుంటారు. వ్యక్తులైనా, దేశాలైనా అభివృద్ధే లక్ష్యంగా ఉంటుంది.
ప్రజల కనీస అవసరాలు తీర్చడం, రోడ్లు, బిల్డింగులు, మార్కెట్లు, దవాఖానలు, విద్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్ల వంటి సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉండటాన్ని నేడు మనం అభివృద్ధిగా చెప్పుకొంటున్నాం. అయితే అభివృద్ధి అనే భావనకు ఇంతకుమించిన విస్తృతార్థం ఉన్నది. వ్యక్తికైనా, దేశానికైనా అనేక కోణాలలో ఈ అంశంతో ముడిపడి ఉన్నది. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, వైజ్ఞానిక, నైతిక, సాంకేతికత వంటి విభిన్న కోణాల్లో అభివృద్ధిని బేరీజు వేయాలి.
ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే ఐరాస అభివృద్ధిని విస్తృతార్థంలో చూస్తుంది. అది 1990 నుంచి ‘హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ (హెచ్‌డీఐ)’, 2014 నుంచి ‘సైస్టెనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ (ఎస్డీఐ)’లతో సభ్యదేశాలకు మార్గదర్శ నం చేస్తుంది. హెచ్డీఐలో విద్య, వైద్యం, తలసరి ఆదాయం అనే మూడు అంశాలున్నాయి. ఎస్డీఐ మరింత విస్తృతమైనది. ఇందులో 17 అంశాలున్నాయి. వీటి ఆధారంగా ఐరాస తన సభ్య దేశాలకు లక్ష్యాలు, ప్రణాళికలు ఇవ్వడమేగాక ఆయా దేశాలు సాధించిన ప్రగతి ఆధారంగా వాటికి ర్యాంకులను కూడా ఇస్తున్నది. గత కొన్నేండ్ల ఈ నివేదికలను అధ్యయనం చేస్తే మనకు వివిధ దేశాల్లోని అభివృద్ధి పోకడలు అవగతమవడమే కాకుండా మనల్ని మనం సమీక్షించుకునేందుకు సంకల్పం కూడా కలుగుతుంది.
ఆర్థిక అసమానతలు పెరుగుతున్న దేశాల్లో సామాజిక అశాంతి పెరిగి శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక అసమానతలు తగ్గించే విధానాలను రూపొందించుకోవాలని సూచిస్తున్నది. అలా అసమానతలు తగ్గిన దేశాల్లో నే ప్రజలు క్వాలిటీ లైఫ్‌ను అనుభవిస్తూ సంతోషంగా జీవిస్తున్నారని ‘హ్యాపీనెస్ ఇండెక్స్’ సూచిస్తున్నది. ఈ కోణంలో ముందున్న దేశాల్లో పారదర్శకత పెరిగి అవినీతి నిర్మూలించబడింది. విధానా ల రూపకల్పనలో, పరిపాలనలో ప్రజల భాగస్వా మ్యం పెరిగి సామాజిక నివాసయోగ్యత పెరిగింది. అందుచేతనే ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, స్వీడన్, న్యూజిలాండ్, కెనడా, నెదర్లాండ్స్, ఐస్లాండ్ వంటి దేశాల్లో విద్య, వైద్యం, పర్యావరణం ప్రజాస్వామ్య చైతన్యాలు, జీవన ప్రమాణాలు అత్యున్న త స్థాయిలో ఉన్నాయి.
ఒకవైపు బిలియనీర్లు పెరగటం, మరోవైపు పేదరికం పెరగటం అనేక దేశాల్లో ప్రధానంశంగా కన్పిస్తున్నది. దేశ సంపదలో ఎక్కువ శాతం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంటే మెజార్టీ ప్రజలు చాలీచాలని ఆదాయంతో నెట్టుకువచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఇది సరైన అభివృద్ధి నమూనా కాదు.
విద్యాపరంగా చూస్తే ఈ దేశాలు సంపూర్ణ అక్షరాస్యతను సాధించటమే కాకుండా సామాజిక సగటు విద్యాస్థాయితో 16 గ్రేడ్‌ను దాటి సాధించాయి. ఈ దేశాలలో 90 శాతానికి పైగా ప్రజలు మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేశారు. మన దేశంలో సగటు చదువు 9వ తరగతి మాత్రమే. అంటే సగటు భారతీ య పౌరుడు కేవలం తొమ్మిదేండ్లు మాత్రమే విద్యనభ్యసిస్తున్నాడు. పౌరులందరికీ సమాన అవకాశాలున్న క్వాలిటీ విద్యను అందించే బాధ్యతను ప్రభుత్వాలు స్వీకరించాయి కాబట్టి ఆ దేశాలలో విద్య అత్యున్నత స్థాయిలో ఉన్నది. అసమానతలను తగ్గించాల్సిన విద్య మన దేశంలో వ్యాపారంగా మారటం విషాదం.
‘ఈసురోమని మనుషులంటే దేశమేగతి బాగుపడునోయ్:’ అన్న ట్లు ప్రజలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటేనే ఏ దేశానికైనా అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజలు సమతు ల పౌష్టికాహారాన్ని తీసుకోగలగ టం, శారీరక శ్రమ చేయడం, ప్రజలకు డాక్టర్లు, దవాఖానలు అందుబాటులో ఉండటం వంటి అంశా లు దేశాల ఆరోగ్య సూచిని తెలుపుతాయి. క్యూబాలో ప్రతి 110 మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉంటాడు. ప్రజలకు వైద్యం ఉచితంగా లభిస్తుంది. డాక్టర్లు ఇండ్ల వద్దకే వెళ్లి ప్రజలకు వైద్యం చేస్తారు. మన దేశంలో వైద్యం చాలా ఖరీదైన వ్యవహారం. ప్రజలకు దవాఖానలు అందుబాటులో అంతంత మాత్రమే! షుగర్, బీపీ, ఊబకాయం, థైరాయిడ్, క్యాన్సర్, కరోనా వంటి వ్యాధులు వైద్య వ్యాపారానికి ‘బంగారు గుడ్లు పెట్టే బాతులుగా’ మారాయి. కోట్లు ఖర్చుపెట్టి డాక్టర్లయినవారు వైద్యాన్ని ప్రజాసేవగా చూడటం అసాధ్యం. ప్రజలను జాతి సంపదగా భావించే దేశాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలతో కూడిన గుణాత్మక విద్య, వైద్యాలు ఉచితంగా అందుబాటులో ఉంటున్నాయి. దక్షిణకొరి యా, జపాన్, మలేషియా, సింగపూర్, వియె త్నాం లాంటి ఆసియా దేశాలు కూడా ఈ కోణంలో ముందున్నాయి. జపాన్‌లో ఆయుర్దాయం అన్ని దేశాలకంటే ఎక్కువ. అక్కడి ప్రజల సగటు ఆయుర్దాయం 85 ఏండ్లు.
పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యాలు కూడా అభివృద్ధి మార్గంలో పట్టించుకోవలసిన అంశాలు. వీటిని నాశనం చేసే పారిశ్రామిక అభివృద్ధి నమూనాలను కొన్ని దేశాలు తిరస్కరించాయి. సుస్థిర మానవాభివృద్ధి కోణంలో చర్చించిన ఈ అంశాలన్నింటి పట్లా ప్రజలందరిలో చైత న్యం పెరగాలి. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు కేవలం ప్రేక్షకులుగానో లేదా బాధితులుగానో ఉండిపోకుండా ప్రత్యక్ష పాత్ర పోషించాలి. ఉన్నత చైతన్యంతో కూడిన ప్రజాస్వామ్య కార్యాచరణే సుస్థిర మానవాభివృద్ధికి తోడ్పడుతుంది.
–ఎం.నిర్మల్‌కుమార్
89197 23445