హైదరాబాద్, మే15 (నమస్తే తెలంగాణ): గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్ప (మహువా) పువ్వును గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రధాన వనరుగా మలిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు పోతున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి ‘మహువా ఫ్లవర్ ప్రాజెక్ట్ అమలు’పై నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, వర్షాప్లో అడ్లూరి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు గిరిజనుల గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని, గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.
పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే దిశగా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. మంత్రి సీతక మాట్లాడుతూ ఇప్ప పువ్వు కేవలం అటవీ ఉత్పత్తి మాత్రమే కాకుండా గిరిజన కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు బలమైన ఆధారమని వివరించారు. ప్రతి గిరిజన గ్రామంలో ఇప్ప పువ్వు సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ కోసం మినీ యూనిట్లు ఏర్పాటు చేయాలని, యువతను స్టార్టప్ రంగంలో ప్రోత్సహించాలని సూచించారు.
మహువా ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మారెట్లకు తీసుకెళ్లే అవకాశాలను ప్రొఫెసర్ వెంకటరామయ్య వివరించారు. సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, గిరిజన ఎమ్మెల్యేలు రామచంద్రు నాయక్, మురళీనాయక్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి బీఎల్ సంతోష్, భద్రాచలం పీవో రాహుల్, ఉట్నూర్ పీవో మకరందు, ఏటూరునాగారం పీవో లెనిన్, ప్రొఫెసర్ చంద్రరామారావు పాల్గొన్నారు.