న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల్లో మాయాజాలం జరిగినట్లు నిరూపించగలిగే సాక్ష్యాధారాలను సమర్పించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ (ఈసీ) గురువారం కోరింది. ఈసీపై దాడి చేయడానికి ‘ఓట్ చోరీ’ వంటి కుళ్లు పదాలు ఉపయోగించడానికి బదులుగా ఆధారాలను సమర్పించాలని తెలిపింది. 1951-52లో జరిగిన మొదటి ఎన్నికల నుంచి ‘ఒక వ్యక్తికి ఒక ఓటు’ నిబంధన అమలవుతున్నదని వివరించింది. సాక్ష్యాధారాలేవీ లేకుండా భారతీయ ఓటర్లను దొంగలుగా అభివర్ణించడం కన్నా, ఏ వ్యక్తి అయినా ఏదైనా ఎన్నికల్లో వాస్తవంగా ఓటు వేసినట్లు రుజువులు ఉంటే, లిఖితపూర్వక అఫిడవిట్‌తో ఈసీకి సమర్పించాలని తెలిపింది. భారతీయ ఓటర్ల కోసం ‘ఓట్ చోరీ’ వంటి కుళ్లు పదాలను వాడటం ద్వారా తప్పుడు కథనాలను సృష్టించే ప్రయత్నం చేయడమంటే, కోట్లాది మంది భారతీయ ఓటర్లపై, లక్షలాది మంది ఎన్నికల సిబ్బంది చిత్తశుద్ధిపై ప్రత్యక్షంగా దాడి చేయడమేనని తెలిపింది.
రాహుల్ గాంధీ ఈ నెల 7న మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఓట్ చోరీ జరుగుతున్నదని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీ ఆధారాలను అఫిడవిట్‌తోపాటు సమర్పించాలని రాహుల్‌ను పలుమార్లు కోరింది. దీనిపై రాహుల్, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఎంపీ మరోసారి ఎందుకు ప్రమాణం చేయాలని ప్రశ్నించారు.