న్యూఢిల్లీ: మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించినట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) కాంగ్రెస్‌కు తెలిపింది. చట్టబద్ధమైన అన్ని ఆరోపణలపైనా సమీక్ష జరుపుతామని చెప్పింది. ఎన్నికల ప్రక్రియపై సందేహాలు, అభ్యంతరాలపై చర్చించేందుకు ఓ ప్రతినిధి బృందాన్ని మంగళవారం పంపించాలని కాంగ్రెస్‌ను కోరింది. మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలలో పొంతన లేదని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై సాక్ష్యాధారాలను సమర్పించేందుకు వ్యక్తిగత విచారణకు అవకాశం కల్పించాలని ఈసీని కోరింది. దీనికి ఈసీ స్పందిస్తూ, పోలింగ్ స్టేషన్లవారీగా సమాచారం అభ్యర్థుల వద్ద ఉందని తెలిపింది. ప్రతి దశలోనూ అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పాల్గొంటారని, ఈ సమాచారాన్ని తనిఖీ చేసుకోవచ్చునని వివరించింది.
మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతోపాటు, నిధుల వరదలు వెల్లువెత్తాయని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ చెప్పారు. ప్రముఖ హక్కుల ఉద్యమకారిణి మేధా పాట్కర్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ కనెక్షన్‌తో కొన్ని సిస్టమ్స్‌ను మార్చవచ్చునని ప్రయోగాలు వెల్లడించాయని తెలిపారు.