ఉమ్మడి మెదక్ జిల్లా నెట్వర్క్, జూలై 5 ; ప్రజాపాలన అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. సర్కారు ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరుద్యోగులు హైదరాబాద్లో శుక్రవారం తలపెట్టిన టీజీపీఎస్సీ ముట్టడికి యత్నించగా..ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. జిల్లా నుంచి తరలివెళ్లే నిరుద్యోగ యువకులను, ఆయా సంఘాల నాయకులను గురువారం అర్ధరాత్రి నుంచే పోలీసులు నిర్బంధించారు. మరికొన్ని చోట్ల ఆయా నేతలను అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందలాది మంది నిరుద్యోగ యువకులను, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.