హిమాయత్‌నగర్,మే6 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న ప్రధాన మంత్రి మోదీ చర్యలపై ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టీ నరసింహ ప్రజలకు పిలుపు నిచ్చారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం హిమాయత్‌నగర్ వైజంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ ధరలను అడ్డగోలుగా పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.993 పెంచడంతో రూ.3,314 చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో అనేక తప్పుడు వాగ్దానాలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్రం కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఉద్యోగాలు,ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత టీ.స్టాల్,టీఫిన్ సెంటర్లు,హోటల్స్ నడుపుకుంటూ ఉపాధి పొందుతున్నారని గ్యాస్ ధరలను పెంచడంతో వారి ఉపాధిపై తీవ్ర ప్రభావం పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులు, దోపిడీ వర్గాలకు మరింత లాభాలు చేకూర్చేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచుతుందని మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో మోదీ కీలు బొమ్మగా మారిపోయాడని విమర్శిం చారు.
ఈ నెల 10న రాష్ర్టానికి మోదీ వస్తున్న నేపథ్యంలో విభజన హామీలు, రాష్ర్టానికి రావాల్సిన నిధుల కేటాయింపు వంటి విషయాలపై మోదీని నిలదీసేందుకు ప్రజలు నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి స్టాలిన్,సహాయ కార్యదర్శి కమతం యాదగిరి,నేతలు బి.వెంకటేశం, ఎన్.శ్రీకాంత్, కాంపల్లి శ్రీనివాస్, మహ్మద్ సలీం, ఉమర్ఖాన్, సక్రిబాయి, బాలకృష్ణ, మహమూద్, బి.కిషన్, అనిల్‌కుమార్, భగత్‌సింగ్, షబ్బీర్, సుశాంత్, అరుణ్, లతీఫ్, మనోజ్ పాల్గొన్నారు.